Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డి..ట్రెండ్ ఫాలో అవట్లేదు..సెట్ చేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   17 Nov 2019 7:26 AM GMT
జగ్గారెడ్డి..ట్రెండ్ ఫాలో అవట్లేదు..సెట్ చేస్తున్నాడు!
X
రాజకీయాలు అయినా... సినిమా రంగమైనా.. అందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతారు.. కానీ కొంతమంది మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో నూతన ఒరవడితో ట్రెండ్ ఫాలో అవ్వకుండా సెట్ చేయడానికి చూస్తున్నాడు మన జగ్గారెడ్డి. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనూహ్యంగా పీసీసీ చీఫ్ తెరపైకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ అధిష్టానానికే ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. కాంగ్రెస్ వర్గాలనే విస్మయపరిచిన జగ్గారెడ్డి ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

*దరఖాస్తుతో ఆశ్చర్యపరిచాడు..

కాంగ్రెస్ లో పీసీసీ పదవి రావాలంటే డబ్బు - పరపతి - ప్రజల్లో ఫాలోయింగ్ - కాంగ్రెస్ పెద్దలను మేనేజ్ చేసే సామర్థ్యం, ఇక కులం ప్రధానంగా ఉంటాయి. కానీ వీటిలో కొన్ని క్వాలిటీలు లేకున్నా జగ్గారెడ్డి మాత్రం త్యాగాన్ని బయటకు తీసి పార్టీ కోసం నిబద్ధతను చాటుతూ ఏకంగా సోనియా - రాహుల్ లకు పీసీసీ చీఫ్ పదవి కావాలంటూ దరఖాస్తు చేయడం ఆసక్తి రేపుతోంది.. దరఖాస్తులో తన ఆర్ ఎస్ ఎస్ జీవితం నుంచి నేటి ఎమ్మెల్యే వరకు అన్నింటిని వివరించాడు జగ్గారెడ్డి. కేసులు కూడా పొందుపరిచాడు.

*ఎమ్మెల్యే టికెట్ వద్దు.. అధికారంలోకి తీసుకొస్తా..

ఏ పీసీసీ అధ్యక్షుడైనా సరే తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని గెలిస్తే సీఎం తానేనని ఇప్పటి నుంచే కలలుగంటారు. కానీ జగ్గారెడ్డి మాత్రం తనను పీసీసీ చీఫ్ ను చేస్తే ఎమ్మెల్యే టికెట్ అడుగనని.. ఎన్నికల్లో పోటీచేయనని.. కేవలం కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని కొత్త ఆలోచనలను కాంగ్రెస్ ముందుంచాడు. అధికారంలోకి తీసుకొచ్చాక కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపాడు.

*అందరికీ భిన్నంగా జగ్గారెడ్డి

ఎన్నికల్లో పోటీచేయకుండా కేవలం పార్టీ కోసమే పనిచేస్తూ అధికారంలోకి తీసుకొస్తానని జగ్గారెడ్డి చేసిన ప్రకటన అందరు నాయకులకు భిన్నమైన ఆలోచనగా చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయడమే ఎజెండాగా పదవీ త్యాగం చేస్తున్న జగ్గారెడ్డి కోరికను మరి కాంగ్రెస్ అధిష్టానం మన్నిస్తుందో లేదో చూడాలి. ఇలా ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేస్తున్న జగ్గారెడ్డి వైఖరి కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.

*పది మంది వరకు బరిలో..

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం తెలంగాణలో దాదాపు పది మంది వరకూ పోటీపడుతున్నారు. మరి త్వరలోనే జరగబోయే పీసీసీ చీఫ్ ఎంపికలో జగ్గారెడ్డి ప్రతిపాదనను సోనియా, రాహుల్ లు పరిశీలిస్తారా లేదా అన్నది వేచిచూడాలి.