Begin typing your search above and press return to search.

వైసీపీలోకి వ‌చ్చేందుకు జ్యోతుల రెడీ!

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:43 AM GMT
వైసీపీలోకి వ‌చ్చేందుకు జ్యోతుల రెడీ!
X
జంప్ జిలానీల‌ను అంద‌లానికి ఎక్కించ‌డం - పార్టీని క‌ష్ట‌కాలంలో నిల‌బెట్టిన వారిని లైట్ తీసుకోవ‌డం అనే రీతిలో సాగుతున్న అధికార తెలుగుదేశం పార్టీ పెద్ద‌ల‌ వైఖ‌రి ఆ పార్టీ నేత‌ల‌ను తీవ్రంగా క‌లచివేస్తోంది. పార్టీని నిల‌బెట్టేందుకు తాము చేసిన శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయిపోతుండ‌టంతో సొంత దారి చూసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలో వారికి స‌రైన ప్ర‌త్యామ్నాయ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌నిపిస్తోంది. వైసీపీలో చేరేందుకు ఏకంగా అధికార పార్టీ ప‌ద‌వుల‌కు సైతం గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీ నేత‌ - ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ జ్యోతుల చంటిబాబు తాజాగా ఇదే నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇటీవల కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం లభించకపోవడంతో జ్యోతుల చంటిబాబుతో పాటు అనుచరులు అసంతృప్తికి లోనయ్యారు. త‌మ ఆవేద‌న‌ను పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకుపోయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోవ‌డంతో తాజాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవికీ - తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణను కుటుంబసభ్యులు - కార్యకర్తల నిర్ణయం మేరకు ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారిని మరచిపోయి దొడ్డిదారిన వచ్చినవారికి అధిష్టానం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. జ్యోతుల నెహ్రూ 2008లో పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరితే పార్టీకి గడ్డుపరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి పార్టీ జెండాను భుజానవేసుకుని పార్టీని బలోపేతం చేశానన్నారు. వైసిపి నుంచి గెలిచిన నెహ్రూ తెలుగుదేశంలోకి వస్తే చంద్రబాబు ఆహ్వానించారని.. పార్టీకోసం పనిచేసిన తనను విస్మరించడం కలచివేసిందన్నారు.

మ‌రోవైపు జ్యోతుల చంటిబాబు త్వరలో వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని స‌మాచారం. కాకినాడ పురపాలక ఎన్నికల సందర్భంగా ఈ నెల 22న జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న వైసీపీ అధినేత జగన్‌ ను కలసి ఆ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అనుచరులు చెబుతున్నారు. జంప్ జిలానీల కార‌ణంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కుల్లో రాష్ట్రంలోని అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే అసంతృప్తి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.