Begin typing your search above and press return to search.

రెంటికీ చెడ్డ రేవ‌డిలా జ‌గ్గారెడ్డి.. భ‌య‌ప‌డ్డారా.. భ‌య‌పెట్టారా..!

By:  Tupaki Desk   |   5 July 2022 9:12 AM GMT
రెంటికీ చెడ్డ రేవ‌డిలా జ‌గ్గారెడ్డి.. భ‌య‌ప‌డ్డారా.. భ‌య‌పెట్టారా..!
X
తెలంగాణ కాంగ్రెస్ లో అస‌మ్మ‌తి వాదం ఇంకా చ‌ల్లార‌లేదు. రాహుల్ హెచ్చ‌రించినా చాప‌కింద నీరులా విస్త‌రిస్తూనే ఉంది. నివురుగ‌ప్పిన నిప్పులా ర‌గులుతూనే ఉంది. ఒకరు కాకపోతే మ‌రొక‌రు నూత‌న నాయ‌క‌త్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఒక‌సారి అంతా బాగుంది అనుకునేలోపే మ‌రోసారి మొద‌టికొచ్చిన‌ట్లు ప‌రిస్థితి ఉంటోంది. దీంతో ద్వితీయ శ్రేణి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అయోమ‌యానికి గుర‌వుతున్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారం మ‌రోసారి కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామకాన్ని మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తున్న జ‌గ్గారెడ్డికి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా రూపంలో మరో ఆయుధం దొరికిన‌ట్లు అయింది. య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జ‌ల‌విహార్ వ‌ర‌కు భారీ వాహ‌న ర్యాలీ నిర్వ‌హించి కాంగ్రెస్ కార్య‌క్ర‌మాన్ని హైజాక్ చేసింది.

దీంతో టీ కాంగ్రెస్ ఆ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండిపోయింది. ఇక్క‌డ టీఆర్ఎస్‌-కాంగ్రెస్ ప‌ర‌స్ప‌రం బ‌ద్ధ‌శ‌త్రువులు కాబ‌ట్టి య‌శ్వంత్ సిన్హాను ఎవ‌రూ క‌ల‌వొద్ద‌ని రేవంత్ ఆదేశించారు. అయితే దీన్ని ధిక్క‌రించి పార్టీ సీనియ‌ర్ నేత వి హ‌నుమంత‌రావు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. జ‌గ్గారెడ్డి కూడా క‌లిసే ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రేవంత్ ఘాటు ప‌ద‌జాలం ఉప‌యోగించారు. పార్టీ లైన్ ఎవ‌రైనా మీరితే గోడకేసి కొడ‌తాన‌ని వ్యాఖ్యానించారు.

దీనిపై అభ్యంత‌రం తెలిపిన జ‌గ్గారెడ్డి రేవంత్ పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఎవ‌డ‌ని.. పీసీసీని కొనుక్కున్నాడా అని.. ఆయ‌న‌కు ఎవ‌రూ జాగీర్లు కాద‌ని.. టెంప్ట్ అయ్యే వ్య‌క్తి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ప‌నికిరాడ‌ని.. వెంట‌నే ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా రేవంత్ వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌ని.. మ‌రుస‌టి రోజు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని వెల్ల‌డించారు.

దీంతో అంద‌రూ జ‌గ్గారెడ్డి రాజీనామా చేస్తార‌నే భావించారు. కానీ ఆయ‌న అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకున్నారు. తాను మాట్లాడిన మాట‌లు పార్టీ బాగుకోస‌మేన‌ని.. ఆ వ్యాఖ్య‌ల్లో వ్యూహం ఉంద‌ని.. తాను కాంగ్రెస్ లోనే ఉంటాన‌ని చెప్పుకొచ్చారు. కానీ జ‌రిగింది వేరని తెలుస్తోంది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే ఒక‌సారి హెచ్చ‌రించిన అధిష్ఠానం మ‌రోసారి పున‌రావృతం కావ‌డంతో పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే యోచ‌న చేసింద‌ట‌. వీహెచ్ తో పాటు జ‌గ్గారెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వాల‌ని భావించింద‌ట‌. అలాగే పార్టీలోని మిగ‌తా సీనియ‌ర్లు కూడా జ‌గ్గారెడ్డిని హెచ్చ‌రించార‌ట‌.

దీంతో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ జ‌గ్గారెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌కు వేరే బాష్యం చెప్పారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా మారింద‌ని పార్టీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇక‌పై ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ సీరియ‌స్ గా తీసుకోర‌ని.. పార్టీలో ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని.. బ‌య‌టికి వెళ్లినా ఇత‌ర పార్టీలు కూడా ఆయ‌న‌ను న‌మ్మ‌బోవ‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇది ఆయ‌న స్వయంకృతాప‌రాధంగానే భావిస్తున్నారు. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!