Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ జ‌గ్గారెడ్డి మ‌రో వివాదం ఏఐసీసీ సెక్ర‌ట‌రీకి సంచ‌ల‌న‌ లెట‌ర్‌

By:  Tupaki Desk   |   13 Nov 2021 3:46 PM GMT
టీ కాంగ్రెస్ జ‌గ్గారెడ్డి మ‌రో వివాదం ఏఐసీసీ సెక్ర‌ట‌రీకి సంచ‌ల‌న‌ లెట‌ర్‌
X
తెలంగాణ కాంగ్రెస్‌లో అస‌మ్మ‌తి సెగ‌లు ర‌గులుతూనే ఉన్నాయి. నాయ‌కులు ఒక‌రి త‌ర్వాత‌.. అన్న‌ట్టు గా.. పార్టీ అసమ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నాయ‌కులు కూడా రోడ్డున ప‌డుతున్నారు. కొన్నాళ్లుగా ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి ఫైర్ అవుతున్న ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఇదే అస‌మ్మ‌తి విష‌యంలో సీనియర్ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి కూడా ముందున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రేవంత్ టార్గెట్‌గా.. జ‌గ్గారెడ్డి ఫైర్ బ్రాండ్‌గా రెచ్చిపోతున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా .. మ‌రింత సెగ పెంచారు. ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పూర్తిగా చ‌తికిల ప‌డిపోయింది. దీంతో ఈ ప‌రిణామాల‌పై తాజాగా.. స‌మీక్ష నిర్వ‌హించారు. పార్టీ సీనియ‌ర్లు అందరూ హుజూరాబాద్ ఓట‌మి మేధో మ‌థ‌నం చేశారు. అయితే.. ఈ స‌మావేశానికి .. జ‌గ్గారెడ్డిని ఆహ్వానిం చలేదు. దీంతో జ‌గ్గారెడ్డి తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ఇంఛార్జిగా ఉన్న తనకు ఆహ్వానించకపోవడంపై అనుమానం కలుగుతోంద‌ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక‌, ఈ విష‌యాన్ని ఆయ‌న ఏకంగా.. ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీకి మ‌ళ్లింద‌ని జ‌గ్గారెడ్డి త‌న లేఖ‌లో పేర్కొన్నారు. హుజురాబాద్ బై పోల్ సమీక్షకు తనను పిలువకపోవడంపై లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. త‌న‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా? అనే వ్యాఖ్య చేశారు. మూడు నెలలకు ముందే వెంకట్‌ను అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. స్థానిక అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదన్నారు. వెంకట్‌కు ఆర్థిక బలం లేదన్న వాస్తవం రేవంత్‌కు, భట్టి విక్ర‌మార్క‌కు కూడా తెలుసున్నారు. అయినా వారిద్దరూ వెంకట్‌కు ఆర్థిక సహాయం ఎందుకు చేయలేదన్నారు.

కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయిందని, దీనికి బాధ్యులు ఎవరన్నారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. ఇవే ప్రశ్నలు తాను పీఏసీ సమావేశంలో లేవనెత్తానన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను మీడియాలో మాట్లాడితే కొందరు తప్పుపట్టారన్నారు. ఈ రోజు ఢిల్లీ వార్ రూమ్‌లో జరుగుతున్న విషయాలు ఎలా బయటకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. వార్ రూమ్ విషయాలు ఇలా బయటకు చెప్పడం కరెక్టా అని ఆయన నిలదీశారు. మొత్తంగా జ‌గ్గారెడ్డి లేఖ రాష్ట్ర కాంగ్రెస్‌లో సంచ‌ల‌నంగా మారింది. దీనిపై నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.