Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీద కొత్త డౌట్లు వచ్చేలా జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలు విన్నారా?

By:  Tupaki Desk   |   23 May 2022 11:30 AM GMT
కేసీఆర్ మీద కొత్త డౌట్లు వచ్చేలా జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలు విన్నారా?
X
మిగిలిన వారికి రాజకీయ నేతలకు ఎంతో కొంత తేడా ఉందంటే.. చాలామంది ఒప్పుకోరు. కానీ.. కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు.. సదరు నేతల్ని రాజకీయ నేతలుగా ఎందుకు అంటారో ఇట్టే అర్థమయ్యేలా ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితినే తీసుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి. మొన్నటివరకు తన మాటల గన్ ను తన వైరి వర్గంగా ఫీల్ అయ్యే రేవంత్ మీద గురి పెట్టిన ఆయన.. సోనియమ్మను కలిసిన తర్వాత నుంచి ఆయన మాటల్లోనూ.. చేతల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన మొత్తం గురి తమ వైరి వర్గం మీదనే ఉంది.

నిజానికి రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు.. ఆ మాటకు వస్తే అదే పనిగా విరుచుకుపడే టీ బీజేపీ బాధ్యుడు బండి సంజయ్ సైతం మిస్ అయిన విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చిన జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపటమే కాదు.. నిజమే కదా? ఇలాంటి పని సీఎం కేసీఆర్ ఎందుకు చేశారు? అన్న భావన కలిగేలా మారాయి.

తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి.. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన రాజ్యసభ సభ్యుల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థసారధి రెడ్డిని ఎంపిక చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన జగ్గారెడ్డి.. అందరూ మర్చిపోయిన పలు అంశాల్ని గుర్తు చేస్తూ.. సీఎం కేసీఆర్ సైతం ఉలిక్కిపడే వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

‘కరోనా సమయంలో రెమిడెసివర్ పని చేసిందని మొదట్లో ప్రచారం జరిగింది. ఈ మెడిసిన్ కోసం రెండు రాష్ట్రాల్లో పెద్ద స్కాం జరిగింది. హెటిరో పార్థసారథి ఆఫీస్ లో 500 కోట్లు ఐటీ శాఖ పట్టుకుంది. ఈ డబ్బుకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి.. కేసు ఏమైందో మాత్రం ఇంత వరకు చెప్పలేదు. రెమిడెసివర్ పేరుతో రూ.10 వేల కోట్ల స్కాం జరిగింది. ఒక్కొక్క ఇంజక్షన్ లక్ష రూపాయలకు హెటిరో అమ్మింది. ఇంత పెద్ద స్కాం చేసిన హెటిరో పార్థసారథి రెడ్డి.. రాజ్యసభ సభ్యుడు కాబోతున్నాడు.ఈ స్కాం పై విచారణ జరిపించాలి’ అని ప్రశ్నించారు.

అంతేకాదు.. మొదట్లో రెమిడెసివర్ కు పర్మిషన్ ఇచ్చిన కేంద్రం తర్వాత.. ఎందుకు వద్దని చెప్పింది? అన్న ప్రశ్నను సంధించారు. ‘ఫార్మా మాఫియా విచ్చలవిడి తనానికి ఇదోక ఉదాహరణ. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తి కి రాజ్యసభ టిక్కెట్ ఇస్తారా? పార్థసారథి కి రాజ్యసభ టికెట్ రావడం లో.. బీజేపీ హస్తం ఉంది. రెండు పార్టీ ల మధ్య మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. పార్థసారథి పై.. ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తా.. అతని నామినేషన్ ను తిరస్కరించాలని కొరుతా’ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.

నిజమే.. ఐటీ కంపెనీలు భారీ ఎత్తున హెటిరోకు సంబంధించిన డబ్బుల్ని పట్టుకున్నప్పుడు.. ఆ ఆరోపణలు ఉన్న పార్థసారధి రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తే.. బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు? అన్నదిప్పుడు ప్రధాన ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.