Begin typing your search above and press return to search.

ష‌ర్మిల అమిత్ షా వ‌దిలిన బాణం.. రేపు జూ.ఎన్టీఆర్ కూడా వ‌స్తాడుః జ‌గ్గారెడ్డి

By:  Tupaki Desk   |   10 Feb 2021 2:30 PM GMT
ష‌ర్మిల అమిత్ షా వ‌దిలిన బాణం.. రేపు జూ.ఎన్టీఆర్ కూడా వ‌స్తాడుః జ‌గ్గారెడ్డి
X
తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. నిన్నామొన్న‌టి వ‌ర‌కూ ఒక విధంగా ఉన్న పొలిటిక‌ల్ వెద‌ర్‌.. ష‌ర్మిల ఎంట్రీతో ఒక్క‌సారిగా మారిపోయింది! తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెడ‌తానంటూ దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర రెడ్డి కుమార్తె ప్ర‌క‌టించ‌డంతో.. జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలేంటో లెక్క‌లు వేసుకుంటూ త‌మ‌దైన రీతిలో స్పందిస్తున్నాయి పార్టీలు!

మంగళవారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నల్గొండ జిల్లా నాయకులతో సమావేశమైన షర్మిల.. కొత్త పార్టీ ఏర్పాటును కన్ఫాం చేశారు. ఇక, మరోవైపు బ్యాగ్రౌండ్ లో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలు చకచకా సాగిపోతున్నట్టు సమాచారం. అంతేకాదు.. పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీ గా నిర్ణయించబోతున్నట్టు లీకులు అందుతున్నాయి.

కాగా.. షర్మిల పార్టీ పెడుతున్నారనే ప్రకటనపై రెండు రాష్ట్రాల్లోనూ విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయా పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. ష‌ర్మిల పార్టీపై పుట్ట‌క ముందే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో చంద్ర‌బాబు కూడా స్పందించారు. ష‌ర్మిల పార్టీ పెడుతున్నాని చెబుతుంటే.. వైసీపీ నేత‌లు మౌనంగా ఉన్నార‌ని, దీనిపై జ‌గ‌న్ స్పందించాల‌ని అన్నారు. ఇక తెలంగాణ‌లో ప్ర‌ధానంగా కాంగ్రెస్ నాయ‌కులు ష‌ర్మిలకు కౌంట‌ర్ ఇస్తున్నారు.

తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి మాట్లాడుతూ... కొత్త పార్టీ పెడుతూ షర్మిల తప్పు చేస్తున్నారని అన్నారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి పేరును నిలబెట్టాలనుకుంటే కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలి త‌ప్ప‌.. ఇలా చేయ‌డం స‌రికాద‌న్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే షర్మిల పనిచేస్తున్నారని ఆరోపించారు. అస‌లు షర్మిల పార్టీపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించ‌ట్లేద‌ని ప్రశ్నించారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. కాంగ్రెస్ మీద‌కు బీజేపీ ఎక్కుపెట్టిన బాణంలా అనిపిస్తోంద‌న్నారు జ‌గ్గారెడ్డి. ష‌ర్మిల మాత్ర‌మే కాదు... కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్ వీరందరినీ కూడా కాంగ్రెస్ మీద‌కు అమిత్ షా వదిలిన బాణాలు అని ఆరోపించారు జ‌గ్గారెడ్డి.

అంతేకాకుండా.. సామాజిక స‌మీక‌ర‌ణాల గురించి కూడా మాట్లాడారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వర్గాన్నివిడదీసేందుకే.. షర్మిల పార్టీ పెడుతున్నార‌న్న జ‌గ్గారెడ్డి.. రేపోమాపో జూనియ‌ర్ ఎన్టీఆర్ లేదంటే ఆయ‌న కుటుంబంలోంచి ఎవ‌రో ఒక‌రు ఇక్క‌డ‌కు వ‌చ్చి పార్టీ పెట్టే అవ‌కాశం లేక‌పోలేద‌న్నారు. వీరంతా.. బీజేపీ డైరెక్ష‌న్లో వ‌స్తున్నార‌ని ఆరోపించారు. ఉత్త‌ర భార‌తంలో ప‌ట్టు కోల్పోతున్న కార‌ణంగానే బీజేపీ ద‌క్షిణాదిపై గురిపెట్టంద‌న్నారు. ఇదంతా జ‌రుగుతుంటే చంద్ర‌బాబు మాత్రం గోడమీద పిల్లిలా ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాల‌ని చూస్తున్నాయ‌న్న జ‌గ్గారెడ్డి.. ఎన్ని బాణాలు వదిలినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని, హ‌స్తం పార్టీ మ‌ళ్లీ పుంజుకొని స‌త్తా చాటుతుంద‌ని అన్నారు.