Begin typing your search above and press return to search.

మెత్తబడ్డ జగ్గారెడ్డి.. కారణం ఇదేనా!

By:  Tupaki Desk   |   3 Nov 2021 2:30 PM GMT
మెత్తబడ్డ జగ్గారెడ్డి.. కారణం ఇదేనా!
X
కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. ఆ కలహాలు కూడా ఇట్టే పెనం మీద నిటిబొట్టులా ఆవిరైపోతాయి. పొద్దున తీవ్రమైన విమర్శలు చేసుకుంటారు. సాయంత్రానికి ఒకటై పోతారు ఇది కాంగ్రెస్ నేతల తీరు. కాంగ్రెస్‌‌ లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఎక్కువే.. పార్టీలోని నేతల తీరు మాత్రం అప్పుడప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీలో సీనియర్ నాయకులు పదే పదే నోరు జారుతుంటారు. ఆ వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటుంటారు. తిట్టుకున్నా.. కొట్టుకున్నా అది కాంగ్రెస్ నేతలకే సాధ్యమనే విమర్శలు కూడా ఉన్నాయి.

హుజురాబాద్‌లో బల్మూరి వెంకట్‌ను బలి పశువును చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేనా టీపీసీసీ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను ఆయన టార్గెట్ చేశారు. వెంకట్‌ను అభ్యర్థిగా రేవంత్, భట్టి కలిసి నిర్ణయించారని తెలిపారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఆ ఇద్దరిని నిలదీస్తానని ప్రతినబూనారు. అంతా అనుకున్నట్లే ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి జగ్గారెడ్డి వచ్చారు. సమవేశం కూడా వాడివేడిగా సాగింది. ఆ వేడికి జగ్గారెడ్డి ఐస్ ముక్కలా కరిపోయారు. అంతా తూచ్ అనేశారు. జగ్గారెడ్డి, వర్సెస్ రేవంత్, భట్టి వివాదాన్ని కాంగ్రెస్ ముగింపు పలికింది. సమావేశానికి ముందు కూడా జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. సమావేశంలో జగ్గారెడ్డి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తురారో అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మెత్తబడ్డారు. అంతేకాదు తాను మాట్లాడిన మాటలను వదిలేయాలని, సమావేశంలో అందరిని కోరారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన బలహీనత అని చెప్పుకొచ్చారు. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడనని జగ్గారెడ్డి ప్రతిన బూనారు. ఇకపై నియోజకవర్గంలో ఎలా గెలవాలో చూసుకుంటానని, ఎలాంటి వివాదాలకు వెళ్లనని జగ్గారెడ్డి బాస చేశారు.

జగ్గారెడ్డి స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తుంటారు. పార్టీ నేతల తీరును ఆయన తప్పుబడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇందుకు ఇలా మాట్లాడుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే పార్టీ బాగు కోసమేనని సమాధానమిస్తారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రచారంలో కూడా ఆయన పాల్గొనలేదు. ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే... హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు చెరో రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, డబ్బులు లేకుండా అక్కడ ఏం చేయలేనని, అందుకే ప్రచారానికి వెళ్లలేకపోయానని తనదైన శైలీలో జగ్గారెడ్డి సమాధానమిచ్చారు.