Begin typing your search above and press return to search.

రెండు రాష్ట్రాల్ని కలుపుతానంటే మద్దతు ఇస్తానంటున్న ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి

By:  Tupaki Desk   |   31 Oct 2021 4:30 AM GMT
రెండు రాష్ట్రాల్ని కలుపుతానంటే మద్దతు ఇస్తానంటున్న ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి
X
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ నేతలకు కాసింత భిన్నంగా వ్యవహరించే ఆయన.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే వేళలోనూ సమైక్యవాదాన్ని వినిపించిన ఏకైక తెలంగాణ నేతగా జగ్గారెడ్డిని చెప్పాలి. సమైక్యవాదినని చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడని ఆయన.. తాజాగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో ఏపీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని వారి రాష్ట్రంలో పెట్టాలని కోరుతున్నారని.. తమను అడుగుతున్నట్లుగా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యపై స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని.. పార్టీ పెట్టటం ఎందుకు? అసెంబ్లీలో రాష్ట్రాన్ని కలుపుతూ తీర్మానం చేసేస్తే.. ఒకే రాష్ట్రమైపోతుంది.. అప్పుడు ఎవరి సత్తా ఏమిటో చూపించుకోవచ్చు కదా? అంటూ పంచ్ వేశారు. ఇలా.. విభజన జరిగిన ఏడున్నరేళ్ల కాలంలోనే మళ్లీ కలిపే విషయం మీద నేతల నోటి నుంచి వస్తున్న మాటలకు.. జగ్గారెడ్డి మరో అడుగు ముందుకేసి.. కేసీఆర్ కు కాలేలా చేశారని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్ని కలుపుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తాను మద్దతు ఇస్తానని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే.. తాను చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవన్న ఆయన.. మొదట్నించి సమైక్య రాష్ట్రానికి తాను కట్టుబడి ఉన్నానని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనే తన స్టాండ్ చెబితే తెలంగాణ ద్రోహి అన్నారని.. మరి ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తపించిన తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారన్న ఆయన ఆత్మబలిదానాలు చేసుకున్న వారు కోరుకున్నట్టు తెలంగాణ లేదన్నారు.

సమైక్య రాష్ట్రమంటూ రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొత్త డ్రామా మొదలు పెట్టాయని.. కేసీఆర్ చేస్తున్న రాజకీయాల్ని ప్రజలు గమనించాలన్నారు. ఇలా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో చర్చకు తెర తీసేలా మారాయి. మొత్తంగా చూస్తే.. టీఆర్ఎస్ పార్టీని ఏపీలో పెట్టాలన్న మాటను డాబు కోసం చెప్పుకున్న సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ లేని రీతిలో పంచ్ ల మీద పంచ్ లు పడుతున్న పరిస్థితి.