Begin typing your search above and press return to search.

పోలవరం వాటాలు విదేశాల్లో అందాయంట!

By:  Tupaki Desk   |   17 Feb 2018 12:49 PM GMT
పోలవరం వాటాలు విదేశాల్లో అందాయంట!
X
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు అత్యుత్సాహం.. నిధులు విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికే అనేకన అనుమానాలు రేకెత్తించే తీరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. వారు నిధులను సక్రమంగా విడుదల చేయకుండా, బాబును బైపాస్ చేసి కాంట్రాక్టర్లతో స్వయంగా మీటింగులు పెట్టుకోవడం, వ్యవహారాలను సమీక్షిస్తూ ఉండడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువైంది. బాబు పాత్రకు కత్తెర వేయడానికి - అలాగని బహిరంగంగా ప్రకటించకుండా.. కేంద్ర ప్రాజెక్టు గనుక.. తమ ఆధ్వర్యంలోనే పనులు జరిగేలా అప్రకటిత జాగ్రత్తలు తీసుకోవడానికి అనేక కమిటీలు గట్రా వేయడం వెనుక కూడా ఇలాంటి అవినీతి ఆరోపణల కారణం ఉన్నదనే ప్రచారం ఉంది. వచ్చే నిధులను చంద్రబాబునాయుడు వాటాలుగా తీసుకుంటున్నారనే పుకార్లు దండిగానే ఉన్నాయి మరి!

ఇలాంటి పుకార్లకు మరింత ఊతం ఇచ్చేలాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి - విభజన సమయంలో కీలకంగా వ్యవహరించిన జైరాం రమేష్ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. పోలవరం కాంట్రాక్టర్ల నుంచి చంద్రబాబునాయుడు భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నారని జైరాం ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు విదేశాలలో ముడుపులు అందినట్లుగా తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని జైరాం అంటున్నారు. అందుకే ఆయన కాంట్రాక్టర్ల సీఎం లాగా వ్యవహరిస్తున్నారన్నట్లుగా ఆరోపణలు గుప్పించారు.

జైరాం రమేష్ విభజన చట్టానికి సంబంధించి మరో కీలకమైన ప్రతిపాదన కూడా చేశారు. విభజన చట్టం అశాస్త్రీయంగా తయారైందని అనుకుంటే గనుక.. ఆ చట్టంలో సవరణలకు పార్లమెంటులో ప్రతిపాదింపజేయాలని.. ఆ సవరణలకు తాము మద్దతిస్తాం అని ఆయన అంటున్నారు.

జైరాం రమేష్ విభజన సమయంలో రాష్ట్రానికి ద్రోహం జరగడంలో ఎంత కీలకభూమిక పోషించినప్పటికీ ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రతిపాదన మాత్రం బాగానే ఉంది. పార్లమెంటులో విభజన చట్టానికి సవరణలు తేవాలంటూ.. దాన్ని శాస్త్రీయంగా తిరిగి ప్రతిపాదించాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రతిపాదిస్తే వారు రాష్ట్రానికి మంచి చేయడానికి పూనుకున్నట్లు అవుతుంది. భాజపా కూడా శాస్త్రీయంగా విభజన జరగలేదు అనే మొసలి కన్నీరు కారుస్తున్న నేపథ్యంలో వారి డ్రామాలకు కూడా చెక్ పెట్టినట్లవుతుంది.

రాహుల్ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామంటున్న జైరాం మాటలు దండగే గానీ.. ఆయన ప్రతిపాదనను కన్సిడర్ చేయవచ్చునని పలువురు అంటున్నారు.