Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ..‘ఏపీ’ అన్నది లేకుండా చేద్దామనుకుందా?

By:  Tupaki Desk   |   5 March 2016 4:00 AM GMT
కాంగ్రెస్ పార్టీ..‘ఏపీ’ అన్నది లేకుండా చేద్దామనుకుందా?
X
ఆంధ్రులకు మంట పుట్టించే మాట త్వరలో బయటకు రానుందా? విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. ఓదశలో ఆంధ్రప్రదేశ్ అన్న పేరే లేకుండా చేద్దామని కూడా ఆలోచించిందా? 23 జిల్లాల ఏపీలో 10 జిల్లాలు తెలంగాణగా మారిన నేపథ్యంలో మిగిలిన 13 జిల్లాలకు ఏపీ అని ఎందుకు ఉండాలన్న దరిద్రపుగొట్టు ఆలోచన చేసిందా? అంటే.. అవుననే మాట బయటకు వచ్చింది.

ఏపీ విభజనలో మొదటి నుంచి కీలకభూమిక పోషించటంతో పాటు.. ఆంధప్రదేశ్ పునర్విభజన చట్టం తయారీలో కర్త.. కర్మ.. క్రియ మాదిరి వ్యవహరించిన మాజీ మంత్రి జైరాం రమేష్ తాజాగా ఒక పుస్తకం రాస్తున్నారు. ఈ పుస్తకంలో విభజనకు సంబంధించిన అన్ని అంశాల్ని పేర్కొననున్నారు. విభజన నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? విభజన నిర్ణయాన్ని ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు? దాన్ని అడ్డుకునేందుకు ఏపీ నేతలు ఎలాంటి పావులు కదిపారు?తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎందుకు ఇవ్వాలనుకుంది? ఏపీ నేతలు విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. కాంగ్రెస్ అధినాయకత్వం ఆ ఎత్తుల్ని ఎలా అడ్డుకుంది? ఇలా ఎన్నో ఆసక్తికర అంశాల్ని తన తాజా పుస్తకం ద్వారా జైరాం వెల్లడించనున్నారు.

అంతేకాదు.. తాను నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యల్ని మీడియా ఎలా పసిగట్టిందన్న విషయాల్ని తన తాజా పుస్తకం ద్వారా చెప్పనున్నారు. తాను వ్యాఖ్యానించిన ‘‘గోవిందా.. గోవిందా’’ అన్న వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సుముఖంగా ఉందన్న విషయాన్ని మీడియా అర్థం చేసుకోవటాన్ని.. రాయల్ తెలంగాణపై చర్చలు జరుగుతున్న సమయంలో.. సమయం 10 – 12 అయ్యిందంటూ తాను చేసిన వ్యాఖ్యల్ని 10 జిల్లాల తెలంగాణను 12 జిల్లాల రాయల్ తెలంగాణ అంటూ విలేకరులు ఏ విధంగా వార్తలు రాశారు లాంటి ఎన్నో కీలకాంశాలతో జైరాం తన తాజా పుస్తకాన్ని త్వరలోనే బయటకు తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే.. తాజా పుస్తకం విడుదలైతే కాంగ్రెస్ కు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా తీసుకోవాలనుకున్న కొన్ని నిర్ణయాలు ఏపీ ప్రాంత ప్రజల్లో భావోద్వేగానికి గురి చేసి.. కాంగ్రెస్ మీద మరింత కోపాన్ని కలిగించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా జైరాం రమేష్ పుస్తకం కానీ బయటకు వస్తే.. రాజకీయంగా ఎంతోకొంత కలకలం తెలుగు రాష్ట్రాల్లో ఖాయమనే చెప్పాలి.