Begin typing your search above and press return to search.

వాట్సాప్ చాట్ చేసినందుకు జైలు పాలు.. గల్ఫ్ లో విడుదలకు ఎంతో కష్టం?

By:  Tupaki Desk   |   17 Oct 2022 2:30 PM GMT
వాట్సాప్ చాట్ చేసినందుకు జైలు పాలు.. గల్ఫ్ లో విడుదలకు ఎంతో కష్టం?
X
వాట్సాప్.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో వాట్సాప్ లేనిదే పూట గడవని పరిస్థితి. డేటా ఎంత అయినా సరే ఇప్పుడు ఇంటర్నెట్ లేని ఫోన్ ను ఊహించలేము. దేశంలో విచ్చలవిడిగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులు ఇవీ.. అయితే దేశంలో ఒకే.. పరాయి దేశంలో మాత్రం ఇలాంటివి చెల్లవు.. అక్కడ నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అనేక యాప్ ల వాడకంపై నిషేధం ఉంది. సరళీకృత విధానాల వలన భూతల స్వర్గంగా పేర్కొనే దుబాయిలోనూ ఈ ఆంక్షలు ఉన్నాయి.

కాలక్షేపం కోసం నలుగురు స్నేహితులు మాట్లాడుకున్న ముచ్చట్లు వాట్సాప్ లో చేరి ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సౌదీ అరేబియాలో నలుగురు భారతీయులు జైలు పాలయ్యారు. వారి శిక్షా కాలం పూర్తయినా కూడా జైలు నుంచి విడుదల జాప్యం అవుతోంది. దానికి కారణం వారు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే..

సౌదీ అరేబియాలోని అభాలోని ఒక సంస్థలో పనిచేసే ముగ్గురు ప్రవాసీయులు (30 ఏళ్లలోపు) వారు మతపరమైన ఉద్రిక్తతను సృష్టించే కామెంట్స్ చేయగా.. మరొకరు దాన్ని రికార్డు చేసి ఇతరులకు పంచడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కామెంట్స్ చేసిన ముగ్గురు.. రికార్డు చేసిన వ్యక్తిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 5 నెలల 5 రోజుల జైలు శిక్షతోపాటు వేయి రియాళ్ల జరిమానా విధించింది.

ఈ నలుగురు కూడా తమ జైలు శిక్షను గత డిసెంబర్ లోనే పూర్తి చేసుకున్నా.. జరిమానా చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అప్పటి నుంచి జైళ్లోనే మగ్గుతున్నారు. జరిమానా డబ్బును చెల్లించడానికి వీళ్ల బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.

జరిమానా చెల్లించడానికి డబ్బులు లేక వీళ్ల దీనస్థితిని జైలు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. జరిమానా డబ్బును ప్రభుత్వ ఖజానా నుంచి భరించే విధంగా ఇటీవల ఏర్పాట్లు చేయడంతో ప్రవాసీయుల విడుదలకు మార్గం సుగమమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత వీళ్లను భారత్ విమానం ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

వాట్సాప్ గ్రూపులో కామెంట్స్, సోషల్ మీడియాలో .. సౌదీ దేశంపై బాధను వ్యక్తం చేసిన వారికి జైలు శిక్ష పడింది. నిత్యం ఫేస్ బుక్ లో లైవ్ లో ఉండే సౌదీలోని ఒక తెలుగు ప్రవాషీని కేసు విచారణ ఎదుర్కొంటున్నాడు. దుబాయ్, కువైట్ కు చెందిన కొందరి వ్యాఖ్యలపై కూడా పోలీసులు కేసులు నమోదయ్యాయి.

భారత్ సహా వివిధ నెంబర్ల నుంచి వాట్సాప్ గ్రూపుల నుంచి వచ్చిన పోస్టులు లైక్ చేసినా.. షేర్ చేసిన వారు కూడా జైలు పాలయ్యారు. నిఘా వర్గాలు ఎప్పటికీ వీరిపై కన్నేసి అరెస్ట్ లు చేస్తుండడంతో గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు సోషల్ మీడియా వాడాలంటేనే ఇతర దేశాల వారు వణికిపోతున్నారు. ఇస్లామిక్ దేశాల్లో దేవుళ్లకు సంబంధించిన విషయాల్లో కఠిన ఆంక్షలు ఉంటాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.