Begin typing your search above and press return to search.

పోటీకి నో చెప్పటం ఓకే.. ప‌ద‌వులు తీసుకోన‌ని చెప్ప‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   26 March 2019 3:47 AM GMT
పోటీకి నో చెప్పటం ఓకే.. ప‌ద‌వులు తీసుకోన‌ని చెప్ప‌గ‌ల‌రా?
X
కాంగ్రెస్ పార్టీలో క‌నిపించే నాయ‌కులు భ‌లే సిత్రంగా ఉంటారు. గాలి వాట‌గా వీస్తున్న వేళ‌.. తురుంఖాన్లు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే నేత‌లు ప‌లువురు.. పార్టీకి అవ‌స‌ర‌మైన స‌మయంలో ఏదో ఒక మాట చెప్పి ప‌క్క‌కు త‌ప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. యూపీఏ1.. 2 ల‌లో కీల‌క కేంద్ర ప‌ద‌విని చేప‌ట్టిన తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి గురించి తెలిసిందే. మ‌ధ్య‌లో సోనియ‌మ్మ‌కు కోపం వ‌చ్చి ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టారు కానీ.. ఢిల్లీ స‌ర్కిల్స్ లో ఆయ‌న‌కున్న రిలేష‌న్స్ అన్నిఇన్ని కావు.

ఒక‌వేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే కీల‌క మంత్రి ప‌ద‌వికి అవ‌కాశం ఉంద‌న్న పేర్ల‌లో జైపాల్ రెడ్డి ఒక‌రు. అలాంటిది తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే విష‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను పోటీ బ‌రిలో ఉండ‌న‌ని పార్టీ అధినాయ‌క‌త్వానికి ఇప్ప‌టికే చెప్పాన‌ని.. ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటాన‌న్న నిర్ణ‌యాన్ని చెప్పాన‌ని.. ఇందుకు వ‌య‌సు మీద ప‌డ‌టం.. ఆరోగ్య కార‌ణాలుగా ఆయ‌న వెల్ల‌డించారు.

మ‌హూబూబ్ న‌గ‌ర్ జిల్లాలో జ‌రిగిన కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న‌.. ఈ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా బీజేపీలోకి చేరిన మాజీ కాంగ్రెస్ నేత డీకే అరుణ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు బ‌దులుగా మ‌హబూబ్ న‌గ‌ర్ ఎంపీ స్థానానికి పోటీ చేయాల‌ని తాను కోరాన‌ని.. కానీ ప్యాకేజీ కుద‌ర‌నందున ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లుగా ఆరోపణ‌లు చేవారు.

2014లో డీకే అరుణ కార‌ణంగానే తాను ఓడిన‌ట్లుగా చెప్పిన జైపాల్.. ఆమె కాంగ్రెస్ పార్టీని వ‌దిలి బీజేపీలోకి చేర‌ట‌మంటే.. క‌ళ్లు మూసుకొని గుంత‌లో ప‌డ్డ‌ట్లేన‌ని వ్యాఖ్యానించారు. ఇత‌రుల‌పై నింద‌లు వేసే బ‌దులు.. కొత్త పార్టీలో అయినా స‌రే ప‌రిస్థితి చ‌క్క‌బ‌ర్చుకోవాల‌న్న హిత‌వు ప‌లికారు. డ‌బ్బులు ప‌ద‌వుల కోసం పార్టీలు మార‌టం డీకే అరుణ‌కు అల‌వాటంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేవారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం చేసిన కొన్ని త‌ప్పుల కార‌ణంగా అధికారాన్ని కోల్పోయిన‌ట్లుగా చెప్పారు. తాను కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఉంటే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాద‌ని చెప్పిన ఆయ‌న‌.. అంబానీకి రూ.7వేల కోట్ల జ‌రిమానాను విధించిన ఏకైక కేంద్ర‌మంత్రిని తానేన‌ని గొప్ప‌లు చెప్పారు. మ‌రింత గొప్ప మ‌నిషి.. తెలంగాణ ప్ర‌జ‌ల్ని కాంగ్రెస్ కు ఓటు వేయించే విష‌యంలో ఎందుకు విఫ‌ల‌మైన‌ట్లు?

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి అడ్డుగా వ‌స్తున్నా వ‌య‌సు.. అనారోగ్యం.. రేపొద్దున ప‌ద‌వులు చేప‌ట్ట‌టానికి రాదా? అన్న‌ది క్వ‌శ్చ‌న్. సామాన్య కార్య‌క‌ర్త‌గా ఉంటాన‌ని చెబుతున్న జైపాల్ రెడ్డి.. రానున్న రోజుల్లో ఎప్ప‌టికి ప‌ద‌వులు చేప‌ట్ట‌న‌న్న మాట‌ను చెప్ప‌గ‌ల‌రా? త్యాగాల‌కు దూరంగా.. ప‌ద‌వుల‌కు ద‌గ్గ‌ర‌గా వ్య‌వ‌హ‌రించే జైపాల్ లాంటి నేత‌ల పుణ్య‌మా అని కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నేత‌లు మార‌నంత కాలం.. పార్టీ మాత్రం మారుతుందా?