Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆస్తుల గురించి ఆయ‌న మాట్లాడ‌ర‌ట‌!!

By:  Tupaki Desk   |   13 Dec 2016 1:24 PM GMT
కేసీఆర్ ఆస్తుల గురించి ఆయ‌న మాట్లాడ‌ర‌ట‌!!
X
ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయాలంటేనే ప‌దునైన‌ విమ‌ర్శ‌ల‌కు - పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌ల‌కు పెట్టింది పేర‌నే సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు నేత‌లు మాత్రం దీనికి భిన్నం! కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి ఈ కోవ‌లోకే చెందుతారు. తాజాగా ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్ర‌త్య‌ర్థి అయిన టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ విష‌యంలో త‌న హుందాత‌నం చాటుకున్నారు. కేసీఆర్ వ‌ద్ద పెద్ద ఎత్తున సొమ్ములు ఉన్న విషయ‌మై వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ విష‌య‌మై తాను వ్యాఖ్య‌లు చేయ‌లేన‌ని జైపాల్ రెడ్డి అన్నారు. కానీ ఈ విష‌యంలో అనుమానాలు మాత్రం ఉన్నాయ‌ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు.

పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో ముందుగా విమర్శించిన కేసీఆర్ అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని పొగ‌డ‌టం మొద‌లు పెట్టార‌ని జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి వెళ్ల‌న‌ప్ప‌టికీ కేసీఆర్ మాత్ర‌మే ఢిల్లీ వెళ్లి ముచ్చ‌టించ‌డం ఆయ‌న ఆస్తుల విష‌యంలో సందేహాల‌కు ఆస్కారం ఇస్తోంద‌ని అన్నారు. కేసీఆర్‌ ముందునుంచే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని, 2009లో దగ్గరయ్యారని - 2014లో అదే ప్రయత్నం చేశారని జైపాల్ రెడ్డి చెప్పారు. కాగా కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ విమ‌ర్శ‌ల‌ను జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. త‌న‌లాంటి వారు స్థాయిని త‌గ్గించుకొని కేసీఆర్ వ‌లే విమ‌ర్శ‌లు చేయ‌లేర‌ని జైపాల్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ నేత‌ల వ‌ద్దే అక్ర‌మాస్తులు ఉన్నాయ‌నే వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. అది నిజ‌మైతే ఐటీ దాడులు చేసుకోవ‌చ్చున‌ని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/