Begin typing your search above and press return to search.

పీవీని కాంగ్రెస్ మళ్లీ గుర్తుచేసుకుంటోంది

By:  Tupaki Desk   |   18 Sep 2015 6:14 AM GMT
పీవీని కాంగ్రెస్ మళ్లీ గుర్తుచేసుకుంటోంది
X
జైరాం రమేశ్.... ఈ కేంద్ర మాజీ మంత్రి మిగతా కాంగ్రెస్ నేతల కంటే కాస్త భిన్నమైనవాడే. కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడేసే ఈయన వ్యాఖ్యలు అప్పుడప్పుడు వివాదాస్పదమవుతుంటాయి. సొంత పార్టీని విమర్శించడం... ఇతర పార్టీలను, నాయకులను పొగడడం వంటివీ చేస్తుంటారు. తాజాగా ఆయన రాసిన పుస్తకం ఒకటి చర్చనీయాంశమవుతోంది. పీవీ నరసింహరావు ప్రధాని ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై ఆయన తన పుస్తకంలో వెల్లడించిన విషయాలపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. పీవీ హీరోయా... విలనా అంటూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా తెలుగు బిడ్డ పీవీ మరోసారి ఆ పార్టీలో అందరి మదిలో మెదులుతున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల వరకు కేంద్ర మంత్రిగా ఉన్న జైరాంరమేశ్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయి అధికారం కోల్పోయిన తరువాత ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. అయితే... అది కొద్ది రోజులే.... కాస్త గేప్ తీసుకున్న తరువాత ఆయన ఈ ఏడాది కాలంలో రెండు పుస్తకాలు రాసి పడేశారు. అందులో ఒకటి పర్యావరణానికి సంబంధించినది కాగా రెండోది రాజకీయాలకు సంబంధించినది. ''టు ది బ్రింక్ అండ్ బేక్... ఇండియాస్ 1991 స్టోరీ'' అనే ఈ పుస్తకం ఇప్పుడు సంచలనంగా మారింది.

1991 నాటి పీవీ నరసింహరావు పాలనలోని 35 రోజుల కాలాన్ని ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ కావడం విశేషం. ఇంకో విషయం ఏంటంటే అప్పటికి జైరాం ఇంకా రాజకీయంగా కుర్రకుంకే. ప్రధాని కార్యాలయంలో ఆయన అప్పటికి జూనియర్ అధికారిగా ఉంటూ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు. ఈ పుస్తకంలో ఆయన పీవీ అనుకూల అభిప్రాయాలే అధికంగా వెల్లడించారు.. అప్పటి రాజకీయ పరిస్థితులు... సంస్కరణల ప్రభావం... ఆ సంస్కరణల వెనుక ఉన్న ఉద్దేశం... పార్టీ పీవీని ఎలా చూసింది వంటివన్నీ ప్రస్తావించారు. నిజానికి ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పీవీపై సరైన అభిప్రాయం లేనప్పటికీ జైరాం రమేశ్ పీవీ కేంద్రంగా పుస్తకం రాయడం విశేషం. ఆయన తాజా పుస్తకం నేపథ్యంలో ఆ పార్టీలో పీవీ మరోసారి అందరి నోళ్లలో మెదులుతున్నారు.