Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ దారుణ ప‌రిస్థితిని చెప్పిన మేధావి

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:18 AM GMT
కాంగ్రెస్ దారుణ ప‌రిస్థితిని చెప్పిన మేధావి
X
ప్ర‌జా బ‌లం లేకున్నా.. మేధావి అన్న ట్యాగ్ లైన్ తో కొంద‌రు రాజ‌కీయ నేత‌లు కీల‌క స్థానాల్ని సొంతం చేసుకుంటారు. అదేమంటే వారికున్న అపార‌మైన మేధ‌స్సును ప్ర‌స్తావిస్తుంటారు. నిజంగానే వారికి అంత మేధ‌స్సు ఉంటే.. మునిగే పార్టీని తేలేలా చేయాలి క‌దా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌దు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ స‌ర్కారు ఒక వెలుగు వెలిగిన వేళ‌లో అపార‌మైన మేధ‌స్సు ఉన్న నేత‌గా.. విష‌యాల మీద ప‌ట్టున్న వ్య‌క్తిగా ప్ర‌చారం పొందారు మాజీ కేంద్ర‌మంత్రి జైరాం ర‌మేష్.

జాతీయ రాజ‌కీయాల్లో మోడీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత జైరాం ర‌మేష్ లాంటోళ్లు అడ్ర‌స్ లేకుండా పోవ‌టం.. వారి నోటికి తాళాలు ప‌డిపోవ‌టం తెలిసిందే. అలాంటి జైరాం తాజాగా ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత గ‌డిచిన మూడున్న‌రేళ్లలో జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల్లో పంజాబ్ మిన‌హా మిగిలిన రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగి.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత విప‌క్షంగా మిగిలిన కాంగ్రెస్‌.. ఇప్పుడు నామ‌మాత్రంగా మార‌ట‌మే కాదు.. త‌న ఉనికే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లోకి ఉండిపోయింద‌న్న భావ‌న దేశ ప్ర‌జ‌ల్లో క‌లిగే ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌లో కాంగ్రెస్ మేధావి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానూ.. కాంగ్రెస్ దీన స్థితిని చాటి చెప్పేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌ధాని మోడీ- బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల‌తో పోరాటం అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాద‌ని.. కాంగ్రెస్ నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స‌వాళ్ల‌ను అధిగ‌మించాల‌న్న పిలుపునిచ్చిన ఆయ‌న‌.. త‌మ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంద‌న్నారు. గ‌తంలోనూ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎదురైనా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురు కాని రీతిలో కాంగ్రెస్ ఉనికే సంక్షోభంలో ప‌డిందంటూ వ్యాఖ్యానించ‌టం ద్వారా కాంగ్రెస్ నేత‌ల‌కు క‌రెంట్ షాక్ కొట్టే మాట‌ను చెప్పారు.

మ‌నం మోడీ.. షాల‌తో పోరాడుతున్నామ‌న్న విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లంతా అర్థం చేసుకోవాల‌న్న జైరాం.. వారిద్ద‌రి ఆలోచ‌న‌.. కార్యాచ‌ర‌ణ భిన్నంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. పాత‌బ‌డిన నినాదాలు.. బూజుప‌ట్టిన ఫార్ములాలు.. పాత వ్యూహాలు ప‌ని చేయ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. నితీశ్ తీరుతో యూపీఏ కూట‌మికి షాక్ త‌గిలింద‌ని.. ఈ ఏడాది చివ‌ర్లో పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాల్ని రాహుల్ గాంధీ స్వీక‌రిస్తార‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. పార్టీ నాయ‌క‌త్వం విష‌యంలో రాహుల్ అనిశ్చితికి తెర దించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని.. ఇలాంటి ప‌రిస్థితి మ‌రికొంత‌కాలం కంటిన్యూ అయితే మంచిది కాద‌న్నారు. ఏమైనా కాంగ్రెస్ మేధావి చెప్పిన మాట‌లు ఆపార్టీ నేత‌ల‌కు క‌రెంటు షాక్ లా మార‌తాయ‌న‌టంలో సందేహం లేదు.