Begin typing your search above and press return to search.

ఆయన మళ్లీ వేసేశాడు...

By:  Tupaki Desk   |   7 April 2015 10:30 AM GMT
ఆయన మళ్లీ వేసేశాడు...
X
రాజకీయాల్లో విమర్శలు..వ్యాఖ్యలు కామన్‌ అయినప్పటికీ టైమ్లీ పంచ్‌ లు వేయడం, అవి ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవడం కొందరితోనే అవుతుంది. అలాంటి కొందరిలో కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌ ఒకరు. దేశవ్యాప్తంగా ఎన్డీయే, మోడీ పరువు తీస్తున్న భూసేకరణ ఆర్డినెన్స్‌ పైనే జైరామ్‌ కూడా బాణం ఎక్కుపెట్టారు. ఆ సెటైర్లలో తనదైన ట్విస్టును జోడించారు.

ఎన్నికల్లో తాను గెలిచేందుకు డబ్బు సమకూర్చిన కార్పొరేట్‌ కంపెనీల రుణం తీర్చుకునేందుకే మోదీ భూ సేకరణ చట్టానికి సవరణలు చేపట్టారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దుర్యోధనుడిలా వ్యవహరిస్తూ.. రైతులు, గిరిజనుల నుంచి భూమిని గుంజుకుంటున్నారని ఆరోపించారు. భూ సేకరణ చట్టానికి సవరణల బిల్లును అడ్డుకునేందుకు అవసరమైతే మహాభారత యుద్ధం- 2015 చేయడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ అన్నారు! దుర్యోధనుణ్ని ఓడించేందుకు పాండవుల మాదిరి పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీతో మిగతా పార్టీలూ కలిసిరావాలని జైరాం పిలుపునిచ్చారు!!

కేంద్రం రూపొందించిన ఈ బిల్లును సమాజ్‌ వాదిపార్టీ, బీఎస్పీ, సీసీఎం, సీసీఐ, ఎన్సీపీ, జేడీ(యూ), టీఎంసీ, డీఎంకే పార్టీలు బాహాటంగా వ్యతిరేకించిన సంగతి గుర్తుచేస్తూ మిగతా పార్టీలు కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించాలని జైరామ్‌ కోరారు. భూ సేకరణ సవరణల బిల్లును బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ వ్యతిరేకించాలన్నారు. యూపీఏ- 2 హయాంలో రూపొందించిన భూ సేకరణ చట్టానికి ఎన్డీఏ సర్కార్‌ చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.