Begin typing your search above and press return to search.

బీజేపీ సీఎం.. ఐదేళ్ల‌లో బాగానే పోగేసుకున్నారే!!

By:  Tupaki Desk   |   20 Oct 2022 3:30 PM GMT
బీజేపీ సీఎం.. ఐదేళ్ల‌లో బాగానే పోగేసుకున్నారే!!
X
త్వ‌ర‌లోనే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎం, బీజేపీ కీల‌క నాయ‌కుడు.. జైరాం ఠాకూర్ ఆస్తుల వివాదంతెర‌మీదికి వ‌చ్చింది. ఆయ‌న సీఎం కాక‌ముందు.. అయిన త‌ర్వాత‌.. ఐదేళ్ల అనంత‌రం.. ఆయ‌న ఆస్తులు రెట్టింపు కావ‌డంపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌డుతున్నాయి. మా నాయ‌కులు నిప్పులు అని చెప్పే బీజేపీ నేత‌లు.. దీనిని ఎలా స‌మ‌ర్థించుకుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే..ఎన్నిల‌క నేప‌థ్యంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు తన నియోజకవర్గంలో నామినేషన్ వేసిన ఆయన.. తనకు మొత్తం రూ.6.28 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆయ‌న‌ ఆస్తులు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న ఆయన.. ఈ మేరకు నామినేషన్ వేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం జైరాం ఠాకూర్ మొత్తం ఆస్తుల విలువ రూ.6.28 కోట్లు.

2017 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు రూ.3.27కోట్లుగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో దాదాపు రూ.3కోట్ల ఆస్తి పెరిగినట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లకు తన ఆదాయం రూ.1.80 కోట్లు అని జైరాం ఠాకూర్ ప్రకటించారు. వీటిపై ఆదాయ పన్ను కట్టినట్లు తెలిపారు. సీఎం అఫిడవిట్లోని వివరాల ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో ఆయన భార్య సంపాదన రూ.1.5 కోట్లు. దీనిపైనా ఆమె పన్ను చెల్లించారు. ఇకపోతే, ముఖ్యమంత్రికి మూడు బంగారపు ఉంగరాలు, ఓ గోల్డ్చైన్ ఉన్నాయి.

వీటి విలువ రూ.3.1లక్షలు. సీఎం భార్యకు రూ.17లక్షలు విలువ చేసే 375 గ్రాముల బంగారం ఉంది. వీరికి ఇద్దరు సంతానం కాగా.. చెరో వంద గ్రాముల చొప్పున బంగారం ఉంది. ఈ బంగారం విలువ రూ.11.40 లక్షలు. 1993లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జైరాం ఠాకూర్కు ఎదురుదెబ్బ తగిలింది. 26 ఏళ్ల వయసులోనే చచ్యోట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన.. ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత 1998లో మరోసారి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం మొత్తం ఐదుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చచ్యోట్ స్థానం.. సిరాజ్గా మారింది. ఇప్పుడు ఏడోసారి ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్లోని 68 స్థానాలకు నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితం వెలువడనుంది. ఇదిలావుంటే.. సీఎం ఆస్తులు రెట్టింపుకావ‌డంపై విప‌క్షాలు.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల సొమ్ము దోచేశారంటూ.. తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.