Begin typing your search above and press return to search.

జైషే టార్గెట్!.. భార‌త్‌ - ప్ర‌ధాని మోదీలేన‌ట‌!

By:  Tupaki Desk   |   26 Jan 2018 10:51 AM GMT
జైషే టార్గెట్!.. భార‌త్‌ - ప్ర‌ధాని మోదీలేన‌ట‌!
X
ఇస్లామిక్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధులుగా - ఇస్లామిక్ చ‌ట్టాల‌ను ప‌రిర‌క్షించేందుకేనంటూ రంగంలోకి దిగిపోతున్న ఉగ్ర‌వాద సంస్థ‌లు నిజంగానే బ‌రి తెగిస్తున్నాయి. త‌మ దైవం మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌... ఖురాన్‌ లో ర‌క్త‌పాతానికి తావు లేద‌ని చెప్పినా... ప్ర‌వ‌క్త ఆదేశానుసార‌మే న‌డుస్తున్నామ‌ని చెప్పుకుంటున్న ఇస్లామిక్ అతివాదులు... ఉగ్ర‌వాదులుగా పేట్రేగిపోతూ ఉన్మాదులుగా - ముష్క‌రులుగా మారిపోతున్నారు. వంద‌ల మందిని పొట్ట‌న‌పెట్టుకుంటూ వేలాది కుటుంబాల‌కు క‌డుపు కోత‌ను క‌లిగిస్తున్నారు. మొత్తంగా యావ‌త్తు ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నారు. భార‌త్ దాయాదీ దేశం పాకిస్ధాన్ గ‌డ్డ‌పై పురుడు పోసుకున్న జైష్-ఏ- మొహ‌మ్మ‌ద్ సంస్థ బ‌రితెగింపే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుందని చెప్ప‌క త‌ప్ప‌దు.

స‌రిగ్గా అటు భార‌త గ‌ణతంత్ర దినోత్స‌వ వేడుకలు జ‌రుగుతున్న త‌రుణంలో ఆ సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌కు మొద‌టి శ‌త్రువు భార‌త్ కాగా.. రెండో శ‌త్రువు భార‌త ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోదీనేన‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించి నిజంగానే సంచ‌ల‌నం రేపింది. పాకిస్థాన్‌ లోని సింద్ రాష్ట్రంలోని లర్కానాలో ఓ బహిరంగ సభలో ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు అజార్ సోదరుడు జైషే కీలక నేత మౌలానా తల్హా సైఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. హిందుస్తాన్‌ పై జిహాద్‌ కు ముందుకురావాలని అత‌డు యువతను రెచ్చగొట్టాడు. *మనకు నంబర్‌ 1 శత్రువు ఇండియా - నంబర్ 2 శ‌త్రువు మోదీ* అని అత‌డు ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్నిఅల్‌ ఖలామ్ పత్రిక ద్వారా ఈ సందేశాన్ని ప్ర‌చురించింది. జైష్ నేత అజాహర్ నేతృత్వంలో ఈ పత్రిక నడుపుతున్నారు. భారత్‌ లోని మనవాళ్లు అల్‌ ఖలామ్‌ వెబ్‌ సైట్‌ ద్వారా విషయాలను తెలుసుకోవచ్చున‌ని అత‌డు పేర్కొన్నాడు.

ఉపఖండంలో మినీ సూపర్‌ పవర్‌ గా వ్యవహరిస్తోన్న భారత్‌.. మొదటి నుంచీ పాకిస్తాన్‌ కు అడ్డంకులు సృష్టిస్తూనే ఉందన్నారు. కానీ కశ్మీర్‌ లో మాత్రం భారత సైన్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని అత‌డు ప్ర‌క‌టించాడు. *కశ్మీరీ తల్లులు - సోదరీమణులు సాయం కోసం మనల్ని పిలిచారు. కానీ మనం మాత్రం బానిసలుగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు.. ముజాహిద్దీన్‌ లు సరిహద్దు దాటి చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఇండియాపై జిహాద్‌ చెయ్యడానికి ధైర్యవంతులైన యువకులు మరింత మంది ముందుకురావాలి* అని మౌలానా సైఫ్‌ వ్యాఖ్యానించాడు.