Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా మీద కొట్టుకునే వరకూ వెళ్లిన మిత్రులు

By:  Tupaki Desk   |   1 May 2016 9:39 AM GMT
ప్రత్యేక హోదా మీద కొట్టుకునే వరకూ వెళ్లిన మిత్రులు
X
అర్థవంతమైన చర్చలకు వేదికగా ఉండాల్సిన టీవీ లైవ్ షోలు ఇప్పుడు శృతిమించుతున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. అవాకులు చవాకులు పేలటం.. తాము బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నామన్న విషయాన్ని మరిచి మరి తిట్టుకోవటం ఈ మధ్యన పెరుగుతోంది. రాజకీయంగా వైరం ఉండే పక్షాల మధ్య ఇలాంటివి మామూలే అయినా.. ఏపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో మిత్రుల మధ్యే మాటా మాటా పెరిగిన పరిస్థితి.

ఒక ప్రముఖ ఛానల్ లో ఉదయాన్నే చర్చాకార్యక్రమం షురూ అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం మీద కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్ గా చర్చ సాగుతున్న సమయంలో.. బీజేపీని ఉద్దేశించి ఇటీవల టీడీపీలో చేరిన జలీల్ కానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే షోలో పాల్గొన్న బీజేపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఆయనపైనా జలీల్ ఖాన్ విరుచుకుపడ్డారు.

దీంతో ఇరువురు నేతల మధ్య మాటలు పోయి తిట్లు మొదలయ్యాయి. ఇది కాస్తా ఏకవచనం వరకూ వెళ్లాయి. ఇలా మాటా మాటా అనుకునే క్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కాస్త కటువుగా.. ‘‘సిగ్గు శరం లేకుండా ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారిపోయిన నువ్వా నన్ను విమర్శించేది? ప్రత్యేక హోదా గురించి అడిగే హక్కు కూడా నీకు లేదు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలుచేశారు.

దీంతో మండిపడిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. ‘‘కనీసం నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. నువ్వు నన్నే అనేంతటోడివా?’’ అంటూ ఫైర్ అయ్యారు. జలీల్ ఖాన్ గెలిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అయినా.. ప్రస్తుతం ఆయన ఏపీ అధికారపక్షంలో ఉన్నారు. అంటే.. ఆయన బీజేపీకి మిత్రుడు. అయినా.. ఆ విషయాన్ని మర్చిపోయి.. ఆ రేంజ్లో జలీల్ ఖాన్ విరుచుకుపడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.