Begin typing your search above and press return to search.

జలీల్ ఖాన్ ఏదో చేయబోతే..ఇంకేదో అయింది

By:  Tupaki Desk   |   5 Aug 2016 9:47 AM GMT
జలీల్ ఖాన్ ఏదో చేయబోతే..ఇంకేదో అయింది
X
కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రజల వద్ద మార్కులు కొట్టేయాలని... వారికి శుభాకాంక్షలు చెప్పాలని.. పుష్కరాల సమయంలో జాగ్రత్తలు చెప్పాలని నవ్యాంధ్ర రాజధాని ప్రాంత నేతలు తెగ ఉత్సాహ పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ నిలువెత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంకొందరైతే ఆధ్యాత్మిక సూక్తులు రాస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏదో చేసి తమ పేరు మారుమోగించుకోవాలని.. పుష్కరాలకు వచ్చే ప్రజలకు తమ ముఖం తెలియాలని తపిస్తున్నారు. ఈ సందర్భాన్ని ఫుల్లుగా వాడుకోవాలని రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు తెగ తాపత్రయ పడుతున్నారు.

అందులో భాగంగానే విజ‌య‌వాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కూడా విజయవాడ అంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టించారు. విజయవాడ వ‌న్ టౌన్‌ లో - దుర్గ‌గుడి ప‌రిస‌రాల్లో ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే. అయితే... ఆ ఫ్లెక్సీలపై రాసి ఉన్నది చదువుతున్నవారు మాత్రం అమ్మ బాబోయ్ కృష్ణా పుష్కర స్నానం అంత పాపమా అనుకుంటున్నారట. పుష్కరాలంటే పవిత్రమైనవని అంతా అనుకుంటున్న వేళ జలీల్ ఖాన్ ఫ్లెక్సీలు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. అక్షర దోషాలు - అచ్చు తప్పుల కారణంగా జలీల్ ఖాన్ ఫ్లెక్సీలు తప్పుడు అర్థాలు చెబుతున్నాయి. దీంతో అంతా వాటిని చూసి నవ్వుకుంటున్నారు.

ఇంతకీ జలీల్ ఖాన్ ఆ ఫ్లెక్సీలపై ఏం రాయించారో తెలిస్తే మీరు కూడా నవ్వుకుంటారు. తన ఫొటోల ముద్రించి దాంతో పాటు ‘‘పుష్కర స్నానం సర్వ పాప హారం’’ అని పెద్దపెద్ద అక్షరాలతో అచ్చు వేయించారు. దీంతో అందులోని పొరపాటు అర్థమైనవారంతా నవ్వుతున్నారు. పుష్కరాల సందర్భంగా కృష్ణా నదిలో స్నానం చేస్తే పాపాల హారం మెడలో పడుతుందన్నట్లుగా దీని అర్థం ఉంది. నిజానికి పాప హరం అనో.. లేదంటే పాప సంహారమనో ఉంటే సరిపోయేది. కానీ... చిన్న తేడాతో జలీల్ ఖాన్ పోస్టర్లు జనాలను భయపెట్టేస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే జలీల్ ఖాన్ ఈ పాప హారంలో ఏపీ మంత్రి దేవినేని ఉమాను కూడా ఇన్వాల్వు చేసేశారు. ఫ్లెక్సీల్లో ఆయన ఫొటోను కూడా వాడేశారు.