Begin typing your search above and press return to search.
బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే కామెడీ విన్నారా?
By: Tupaki Desk | 18 April 2018 10:09 AM GMTగోడ మీద పిల్లిలా వ్యవహరించి..అవకాశ వాద రాజకీయాలకు ఆద్యుడిని తానేనన్న రీతిలో వ్యవహరించి టికెట్టిచ్చి గెలిపించిన పార్టీని నట్టేట వదిలేసి అధికార పార్టీలో చేరిపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గుర్తున్నారు కదా. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ తరఫున బరిలోకి దిగి విజయం సాధించిన జలీల్ ఖాన్.. ఆ తర్వాత అధికార పక్షం వైపు మొగ్గారు. టికెట్టిచ్చి... గెలిపించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగానే ఆయన నమ్మక ద్రోహం చేశారు. అయినా కూడా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అవకాశవాద రాజకీయాలపై తనదైన శైలి వాదనను వినిపిస్తూ... న్యాయ పోరాటం చేస్తున్న జగన్... దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి రైట్ రాయల్ గా తిరిగి వారిని గెలిపించుకోవాలని అధికార పార్టీ టీడీపీకి సవాల్ విసురుతున్నారు. ఈ సవాల్ కు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి నుంచి అసలు స్పందనే రావడం లేదని చెప్పాలి. చంద్రబాబు స్పందించకున్నా... తమను గెలిపించి శాసనసభలో అడుగుపెట్టేలా చేసిన జగన్ సవాల్ కు స్పందించాల్సిన అవసరం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉందని చెప్పక తప్పదు.
అయితే చంద్రబాబు మాదిరే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మౌనంతోనే జనానికి చిర్రుత్తుకొచ్చేలా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయినా ఇప్పుడిదంతా ఎందుకంటే... తాను పార్టీ మారి పార్టీ ఫిరాంపుల చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా మరింత మందిని తన వెంట తీసుకెళ్లేందుకు - అంతిమంగా మరింత మందితో నేరాలు చేయించేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో తొలి వరుసలో ఉన్న జలీల్ ఖాన్ యత్నిస్తున్నారన్న వాదన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు వినిపించడం కాదండీ బాబూ... ఆయనే స్వయంగా బహిరంగ వేదికల మీద ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని - తాను చదివానంటూ కామెడీ వ్యాఖ్యలు చేసిన జలీల్... నిన్న ఫిరాయింపులను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయినా ఆయన ఏమన్నారంటే... నిన్న విజయవాడ కేంద్రంగా మాజీ మంత్రి, దివంగత నేత దేవినేని నెహ్రూ ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో జలీల్ మాట్లాడుతూ వైసీపీకి చెందిన మరో పది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని - తమను కూడా టీడీపీలోకి తీసుకెళ్లమని వారు తనను కోరుతున్నారని, ఏ క్షణంలో అయినా వారంతా వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఖాయమని ఆయన చాలా లెంగ్తీ ప్రకటనే చేశారు.
జలీల్ మాట బాగానే ఉన్నా... బీకాంలో ఫిజిక్స్ అన్న చందంగా ఆయన కామెంట్స్ కూడా కామెడీకే కామెడీగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అసలే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి టీడీపీ అనుసరిస్తున్న వ్యూహంతో జనం ఆ పార్టీని ఈసడించుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ప్రత్యేక హోదాపై ఆది నుంచి తనదైన శైలిలో పోరాటం చేస్తున్న జగన్‌కు రోజురోజుకూ జనంలో మద్దతు పెరుగుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేనా గుంటూరు - కృష్ణా జిల్లాల్లో అధికార పార్టీ అని కూడా చూడకుండా టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు ఇటీవలే వైసీపీలో చేరిపోయారు. ఇలాంటి తరుణంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు... అది కూడా పది మంది దాకా తనతో టచ్ లో ఉన్నారని జలీల్ చెప్పడం కామెదీ కాక మరేమిటన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా జలీల్ లాంటి కామెడీ నేతతో పది మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటే కామెడీ కాక మరేమిటని కూడా సాక్షాత్తు టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. మొత్తంగాఈ గతంలో బీకాంలో ఫిజిక్స్ అని వ్యాఖ్యానించి కామెడీ అయిపోయిన జలీల్... ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెబుతూ మరింత కామెడీ అయిపోయారని చెప్పక తప్పదు.