Begin typing your search above and press return to search.
‘ముందస్తు’ ఎన్నికలొస్తున్నాయ్..ఇదిగో సాక్ష్యం..
By: Tupaki Desk | 5 July 2018 6:20 AM GMTఅన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. తెర వెనుక విషయం లీక్ అయిపోయింది. అందుకే ఇప్పుడే ముందస్తుగా సర్దుకుంటున్నారు. మొన్నీ మధ్య సీఎం కేసీఆర్ మోడీతో అంతరంగికంగా జరిపిన చర్చల్లో అసలు విషయం ఇదేనట.. కానీ ఎక్కడా బయటకు రాలేదు..
ముందస్తు ఎన్నికలకు కేంద్రం రెడీ అవుతోంది. వచ్చే అక్టోబర్ లో దేశవ్యాప్తంగా జమిలి లేదా సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సూచనలు అందినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి టీఆర్ ఎస్ నేతలు కూడా సామాగ్రి సిద్ధం చేసుకుంటున్నారు.
దక్షిణాదిలో ఏ పార్టీ ఎన్నికలకు సిద్ధమైనా కానీ ఆ పార్టీకి సంబంధించిన జెండాలు - కండువాలు - ప్రచారసామగ్రిని కరీంనగర్ పూర్వపు జిల్లాలోని సిరిసిల్లలో తయారు చేస్తారు. ఇక్కడ నేత పరిశ్రమ విస్తరించడంతో అన్ని పార్టీలు ఇక్కడే ప్రచార సామగ్రి తయారు చేయిస్తుంటాయి. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సిరిసిల్ల నేతన్నలు బిజీ అయిపోతారు.
తాజాగా మరోసారి సిరిసిల్ల నేతన్నలకు పెద్ద ఎత్తున పార్టీల ప్రచార సామగ్రి తయారీ కాంట్రాక్టులు వచ్చాయి.. చత్తీస్ ఘడ్ - మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ నుంచి నాయకులు వచ్చి కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో వారంతా ఇప్పుడు ఆ తయారీలో నిమగ్నమయ్యారు. మొదట బీజేపీ నేతలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వగా తాజాగా కాంగ్రెస్ నాయకులు కూడా ఇచ్చారట.. ఇది చూసిన టీఆర్ ఎస్ నేతలు కూడా తమ ప్రచార సామగ్రి తయారు చేయాలని డబ్బులు ముట్టజెప్పినట్టు సమాచారం.
ఈ పరిణామాలను బట్టి వచ్చే అక్టోబర్ లో ఎన్నికలు తథ్యం అని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి సిరిసిల్ల నేతన్నలకు కాంట్రాక్ట్ ఇవ్వడం చూస్తుంటే బీజేపీ ముందస్తు ఎన్నికలకు రెడీ అయినట్టు అర్థమవుతోంది. ఈ విషయం లీక్ కావడంతో కాంగ్రెస్ - టీఆర్ఎస్ కూడా సమాయత్తమవుతున్నాయి.