Begin typing your search above and press return to search.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో...జ‌గ‌న్ కొత్త రికార్డు సృష్టించాడుగా...

By:  Tupaki Desk   |   15 Nov 2019 2:30 PM GMT
జ‌మ్మ‌ల‌మ‌డుగులో...జ‌గ‌న్ కొత్త రికార్డు సృష్టించాడుగా...
X
వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా జమ్మలమడుగు ఊహించ‌ని రీతిలో వార్త‌ల్లోకి ఎక్కుతోంది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నేప‌థ్యంలో...మండలంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై ప్ర‌జ‌ల్లో భ‌రోసా పెరిగింది. 2007లో చిటిమిటి చింతల వద్ద బ్రాహ్మణి స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రూ.20వేల కోట్లతో దీనిని నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి అప్పట్లో ముందుకు వచ్చారు. వివిధ కార‌ణాల వ‌ల్ల అది నిర్మాణం కాలేదు. తాజాగా కేంద్ర‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీలో...ఉక్కు క‌ర్మాగారం ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టంతో... జమ్మలమడుగు మండలంలో భూమి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారథ్యంలో గతంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగి ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఆయన తనయుడు జగన్‌ నేతృత్వంలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుందని జిల్లాప్రజలు ఆశిస్తున్నారు. తాను ఎన్నికల్లో చెప్పిన విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కొత్త సీఎం చర్యలు ప్రారంభించారు. ఇటీవల ఓ విదేశీ సంస్థ ప్రతినిధులతో ఆయన చర్చలు జరుప‌గా...కొంత పురోగతి కనిపించింది. తాజాగా కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌తో...ఒక్కసారిగా ధ‌ర‌లు పెరిగిపోయాయి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకు స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కంటితుడుపుగా 2018 డిసెంబర్‌లో మైలవరం మండలంలోని కంబాలదిన్నె వద్ద స్టీల్‌ ప్లాంటు నిర్మాణం కోసం పైలాన్‌ను ఆవిష్కరించారు. పైలాను కోసం రెండుకోట్ల రూపాయలు వెచ్చించడం విశేషం. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్‌ప్లాంటు నిర్మిస్తామని జిల్లా వాసులకు హామీ ఇచ్చారు.

2020 జనవరి 26 న స్టీల్ ప్లాంట్‌కు పునాది రాయి వేస్తానని ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు 250 కోట్ల రూపాయలను ప్రారంభ పెట్టుబడిగా ప్రకటించారు. ప్లాంట్ ఎక్కడికి వస్తుందనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ భూమి ధరలు ఆకాశాన్నంటాయి. జూలైలో ముఖ్యమంత్రి ప్రకటనకు ముందు ఎకరానికి నీటిపారుదల భూమి ధర రూ .7 నుంచి రూ .10 లక్షలకు పెరిగితే, తాజాగా రూ .50 లక్షలకు పెరిగిందని, బీడు భూముల ధరలు అంతకు ముందు రూ .5 లక్షల ఉంటే 25 లక్షలకు పెరిగాయని స‌మాచారం. జమ్మలమడుగు పట్టణంలో ఈ ఐదు నెలల్లో భూమి ధరలు ఐదు రెట్లు పెరిగాయి. పట్టణ శివార్లలో ఒక శాతం (48 గజాల) భూమికి ఇప్పుడు రూ .7 లక్షలు ఉండగా, పట్టణం నడిబొడ్డున పాత బస్ స్టాండ్, తాడిపార్తి రోడ్, ముదూర్నూర్ రోడ్ వంటి రూ .20 లక్షలు ఉంది.