Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే డబ్బుకి అమ్ముడైపోయారు..జమ్మలమడుగు వైసీపీ కౌన్సిలర్ రాజీనామా?

By:  Tupaki Desk   |   17 March 2021 10:30 AM GMT
ఎమ్మెల్యే డబ్బుకి అమ్ముడైపోయారు..జమ్మలమడుగు వైసీపీ కౌన్సిలర్ రాజీనామా?
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీ లో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనకి చైర్మన్ పదవి రాకపోవడానికి కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే కారణం అని ,ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసి వైసీపీ కౌన్సిలర్ రాజీనామా చేశారు. జమ్మలమడుగు నాలుగో వార్డ్ లో గెలిచిన జ్ఞాన ప్రసూన ఈ రోజు ఉదయం తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. తనకు పదవి రాకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుపడుతున్నారని, మొదట తనకు చైర్మన్ పదవి ప్రకటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారని అన్నారు.

తనకు పార్టీ లో ఎమ్మెల్యే వల్ల జరిగిన అన్యాయానికి తీవ్ర మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అమ్ముడుపోయారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవిని అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జమ్మలమడుగు నాలుగో వార్డ్ లో ప్రజాభిమానంతో తాను విజయం సాధించానని, అందరి కంటే అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని పేర్కొన్న జ్ఞానప్రసూన తమకు ఉన్నంతలో డబ్బులు ఇచ్చాం అని తెలిపారు. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి చైర్మన్ పదవి కట్టబెట్టడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జ్ఞాన ప్రసూనకు మద్దతుగా మరికొందరు కూడా రాజీనామాలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొదటి తనకే ఇస్తానని ప్రకటించి ఇప్పుడు ఉన్నపళంగా మాట మార్చి వేరే వారికి పదవిని కట్టబెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇక ఎమ్మెల్యేపై రాజీనామా చేసిన వైసీపీ మహిళా కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించాల్సి ఉంది. జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే ఒక మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.