Begin typing your search above and press return to search.

క‌శ్మీర్‌లో స‌ర్కారు ర‌ద్దు...గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   27 Nov 2018 6:25 PM GMT
క‌శ్మీర్‌లో స‌ర్కారు ర‌ద్దు...గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
స‌రిహ‌ద్దు రాష్ట్రం, నిత్యం వార్త‌ల్లో నిలిచే ప్రాంతం అయిన జ‌మ్ముక‌శ్మీర్‌ లో అనూహ్య పరిణామాల మధ్య అసెంబ్లీ రద్దయిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామంటే తాము అంటూ అటు పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఇటు జమ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేకేపీసీ) నేత సజ్జాద్ లోన్ బుధవారం ముందుకు రావడంతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఏకంగా అసెంబ్లీనే రద్దు చేశారు. 2020 అక్టోబర్ వరకు అంటే, ఇంకా రెండేళ్ల‌ కాలవ్యవధి మిగిలి ఉండగానే 87 మంది సభ్యులు కలిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. అయితే, ఈ ఎపిసోడ్‌ పై గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

కాగా అంతకుముందు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ కు లేఖరాశారు. ప్రస్తుతం తాను జమ్ములో అందుబాటులో లేనని త్వరలోనే వచ్చి కలుస్తామని పేర్కొన్నారు. పీడీపీ 29 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీ 15 మంది, కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు కలిసి.. తమకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని పేర్కొన్నారు. గవర్నర్ ఫోన్‌లో అందుబాటు లోకి రాకపోవడంతో ఈ లేఖను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ముఫ్తీ లేఖ బయటకు వచ్చిన కొద్దిసేపటికే జేకేపీసీ నేత సజ్జాద్ లోన్ కూడా తమకు మెజార్టీ మద్దతు ఉన్నదని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నమని పేర్కొంటూ గవర్నర్‌కు లేఖరాశారు.

ఈ లేఖను గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి వాట్సప్ ద్వారా పంపారు. తమ పార్టీ కి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, బీజేపీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఇతరులు తమకు మద్దతు ఇస్తున్నారని, ఇది సాధారణ మెజార్టీ కంటే ఎక్కువని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు లేఖ రాశాం. ఫ్యాక్స్ పనిచేయకపోవడంతో గవర్నర్ వ్యక్తిగత సహాయకుడికి వాట్సప్ ద్వారా లేఖను పంపాం అని లోన్ ట్వీట్ చేశారు.

అటు పీడీపీకి, ఇటు పీపుల్ కాన్ఫరెన్స్‌కు గవర్నర్ అందుబాటులో లేకపోవడం పై ఎన్సీ నేత ఒమర్‌అబ్దుల్లా ట్విట్టర్‌లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. జమ్ముకశ్మీర్ రాజ్‌భవన్‌కు అత్యవసరంగా కొత్త ఫ్యాక్స్ యంత్రం కావాలి అని ఆయన ట్వీట్ చేశారు. అసెంబ్లీని రద్దు చేయాలని గత ఐదునెలలుగా తమ పార్టీ డిమాండ్ చేస్తుంటే.. పీడీపీ ముందుకు వచ్చిన కొద్దిసేపటికే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం పై పీడీపీ, కాంగ్రెస్ మండిపడ్డాయి. పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలో జూన్ నుంచి గవర్నర్ పాలన కొనసాగుతున్నది. తాజాగా అసెంబ్లీ రద్దుతో లోక్‌సభ తోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.

అయితే, ఇలా ఫ్యాక్స్ ప‌నిచేయ‌క‌పోవ‌డం, తాను ఢిల్లీ చెప్పిన‌ట్లు న‌డుచుకుంటున్నాన‌నే వ్యాఖ్య‌లు తెర‌మీద‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో గ‌వ‌వ‌ర్న‌ర్ ఘాటుగా స్పందించారు. తాను ఒక‌వేళ‌, ఢిల్లీ చెప్పిన‌ట్లు న‌డుచుకునే వాడినే అయితే, జ‌మ్ముకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేకేపీసీ) నేత సజ్జాద్ లోన్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించే వాడిన‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాను ఎవ‌రి ప‌ట్ల పక్ష‌పాత ద‌రోణితోనో..వ్య‌తిరేకంగానో వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా, అంతకుముందు జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బద్ధశత్రువులైన ఎన్సీ, పీడీపీ ముందుకువచ్చాయి. చర్చల అంశాన్ని జమ్ముకశ్మీర్ ఆర్థికశాఖ మాజీ మంత్రి, పీడీపీ నేత అల్తాఫ్ బుఖారీ ధ్రువీకరించారు. కొత్త కూటమి ప్రభుత్వంలో తమ నేత మెహబూబా ముఫ్తీగానీ లేదా ఆమె ఎంపిక చేసిన అభ్యర్థి సీఎంగా ఉంటారని వెల్లడించారు. మరోవైపు బుధవారం సీపీఎం నేత ఎంవై తరిగామి పీడీపీకి మద్దతు ఇచ్చే అంశంపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరిపారు. కాంగ్రెస్, పీడీపీలతో కలువడానికి తనకు అభ్యంతరం లేదని ఎన్సీ అధినేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. కాగా మహాకూటమి ఏర్పడితే ఆర్థికశాఖ మాజీ మంత్రి, అత్యంత ధనిక ఎమ్మెల్యే అయిన అల్తాఫ్ బుఖారీ సీఎం అవుతారని ఊహాగానాలు వెలువడ్డాయి.