Begin typing your search above and press return to search.

కశ్మీర్ చరిత్ర: స్వర్గం..నరకం ఎలా అయ్యింది?

By:  Tupaki Desk   |   6 Aug 2019 5:31 AM GMT
కశ్మీర్ చరిత్ర: స్వర్గం..నరకం ఎలా అయ్యింది?
X
హిమాలయ సానువుల రాష్ట్రం.. ఎత్తైన కొండలు - కోనలు - కప్పబడి ఉండే మంచు - ప్రపంచంలోనే గొప్ప నధులైన గంగా సింధు - ఉప నదులు చీనాబ్ రావి - సట్లెజ్ లతో సస్యశ్యామలం అయ్యే జమ్మూకశ్మీర్ అదీ.. ఒకవేళ భారత్-పాకిస్తాన్ లు దేశాలుగా విడిపోకపోతే భారత్ ఉమ్మడిగా ఉంటే ప్రపంచంలోనే కశ్మీర్ భూతల స్వర్గంగా.. అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్ గా ఉండేది. అంత గొప్ప ప్రకృతి సిద్ధ వాతావరణం అక్కడ ఉంది. కానీ భారత్ - పాకిస్తాన్ లుగా విడిపోయి ఉగ్రవాదానికి ఊతమై ఇప్పుడు రావణ కాష్టంలా రగిలిపోతోంది. సుందర కశ్మీరం... స్వర్గం నుంచి నరకం ఎలా అయ్యిందో తెలుసుకుందాం..

1947లో భారత్ - పాకిస్తాన్ లు దేశాలుగా విడిపోయాయి. అప్పుడు బ్రిటీష్ వారికి సంస్థానంగా ఉన్న కశ్మీర్ ఎటూ వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిలో మిగిలింది. కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండడానికి ప్రయత్నించినా పాకిస్తాన్ ఆక్రమణ - దాడి చేయడంతో భారత్ లో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హిందూ రాజు అయిన రాజా హరిసింగ్ పాలనలో కశ్మీర్ సంస్థానం ఉండేది. అయితే జమ్మూకశ్మీర్ జనాభాలో మెజారిటీ ముస్లింలు.. వీరు 1930 నుంచే మరిన్ని హక్కుల కోసం ఆందోళనలు - తిరుగుబాట్లు చేస్తున్నా రాజా హరిసింగ్ వాటిని అణిచివేస్తున్నారు. 1947 ఆగస్టులో విభజన కారణంగా జరిగిన హింసలో కశ్మీర్ కు వలస వెళ్లిన పంజాబీలు - హిందువులు హత్యకు గురికావడం.. అత్యాచారాల పరంపర కొనసాగింది. ఆ తర్వాత స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న కశ్మీర్ పై పాకిస్తాన్ దాడి చేసింది. ముస్లింలు అధికంగా ఉన్న ఈ సంస్థానాన్ని ఆక్రమించుకోవాలని చూసింది. కానీ భారత్ ను రాజాహరిసంగ్ సాయం కోరడంతో పాటు భారత్ లోనే విలీనం చేశారు.

*స్వాంత్రంత్యం వచ్చాక 1947లో మొదలైన వివాదం..

అది 1947 ఆగస్టు 15.. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజు. అదే రోజు బ్రిటీష్ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న ‘హైదరాబాద్’ - కశ్మీర్ తో సహా 40కు పైగా చిన్న చిన్న రాజ్యాలు స్వతంత్ర్య రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. అయితే చిన్న రాజ్యాలను నాటి ఉపప్రధాని డేరింగ్ నేత సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారత్ లో విలీనం చేశారు. కానీ పెద్ద భూభాగాలైన కశ్మీర్ - హైదరాబాద్ లను వదిలేశాడు. హైదరాబాద్ నిజాం తమను తాము భారత్ లో విలీనం కాము అని చెప్పేశాడు. ఇక రాజా హరిసింగ్ రాజుగా ఉన్న కశ్మీర్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కశ్మీర్ కు కూడా స్వాతంత్ర్యం వచ్చింది. ఇండియా - పాకిస్తాన్ లో కలువమని రాజా హరిసింగ్ ప్రకటించారు. కానీ 1947 - అక్టోబర్ 28న దీన్ని అదునుగా చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ సాయంతో ‘ఆజాద్ కశ్మీర్’ సేన కశ్మీర్ దేశంపై దాడి చేసింది. సగానికి పైగా భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. అయితే రాజా హరిసింగ్ భారత్ సాయం కోరారు. దీంతో భారత ఆర్మీ పోరాటంతో పాక్ సేనలు - ఆజాద్ కాశ్మీర్ వేర్పాటువాదులు వెనక్కి తగ్గారు. ఈ అంతర్యుద్ధం తర్వాత కశ్మీరీలంతా భారత్ లో విలీనం అవుతామని కోరుకున్నారు. ఆ తర్వాత కశ్మీర్ నేత షేక్ అబ్దుల్లా సూచన మేరకు ప్రధాని నెహ్రూతో చర్చలు జరిపి కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని.. కానీ ప్రత్యేక హక్కులు - హోదాలు కల్పించాలని ‘ఆర్టికల్ 370’ను రూపొందించారు. ఈ ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్... భారత్ లో విలీనం అయినా ఆ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు - అస్తిత్వం దెబ్బతినకుండా కండీషన్లు నిబంధనలు రూపొందించారు. 26 అక్టోబర్ 1947న దీనికి సంబంధించిన డిక్లరేషన్ వచ్చింది. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ ను భారత్ లో విలీనం చేశారు.

*పాకిస్తాన్ - భారత్ మధ్య కశ్మీర్ కోసం యుద్ధాలు..

అప్పటి నుంచి కశ్మీర్ తమదేనని పాకిస్తాన్ యుద్ధానికి రావడం.. భారత్ తిరిగి యుద్ధానికి వెళ్లి తిప్పికొట్టడం జరుగుతూనే ఉంది ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలు జరిగాయి. ఎప్పటికీ చిన్న చిన్న కాల్పులు జరుగుతూనే ఉంటాయి. కశ్మీర్ లోని ముస్లింలు కొందరు - వేర్పాటువాదులు పాకిస్తాన్ కు లోపాయికారిగా వ్యవహరిస్తు ఉగ్రవాదంతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. రావణ కాష్టంలా రగులుతున్న కాశ్మీరానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒక గొప్ప సాహసోపేత నిర్ణయంతో పరిష్కారం చూపిందనే మాట అందరినోట వినిపిస్తోంది. 70 ఏళ్లుగా పరిష్కారం కానీ... ప్రతీసారి ప్రపంచ దేశాల మందు ప్రస్తావనకు వస్తున్న కాశ్మీర్ అంశంలో బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేసి సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ కు ఇన్నాళ్లు ఉన్న ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని భారత దేశంలో పూర్తిగా విలీనం చేసింది. అంతేకాదు.. కశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రప్రాలిత ప్రాంతం (ఢిల్లీ లాగా) రాష్ట్రంగా, దాని పక్కనే ఉన్న లఢక్ ను పూర్తి కేంద్ర పాలిత ప్రాంతమైన రాష్ట్రంగా విడగొట్టింది. ఈ విడగొట్టడానికి అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370ని రాష్ట్రపతి ఉత్తర్వుతో నిర్వీర్యం చేసింది.

*ఆర్టికల్ 370తో కశ్మీర్ కు వచ్చిన లాభాలేంటి?

ఆర్టికల్ 370 రక్షణతో జమ్మూ-కశ్మీర్ భారత్ లో విలీనం అయ్యింది. అయితే అదో రాష్ట్రంగా కాకుండా సామంత రాజ్యంగానే భారత్ లో ఇన్నాళ్లు బతికింది. అందులోని హక్కులు చూస్తే మనకు అదే కనిపిస్తుంది. ఆర్టికల్ 370 ప్రకారం భారత్ లో విలీనం అయిన కాశ్మీర్ కు భారత రాజ్యంగంలోని అన్ని చట్టాలు - నిబంధనలు వర్తించకుండా రక్షణ కల్పించారు. ‘రక్షణ - విదేశీ వ్యవహారాలు - ఆర్థిక వ్యవహారాలు - సమాచార ప్రసారం’ మాత్రమే భారత్ రాజ్యాంగానికి, కాశ్మీర్ కు ఒకే రకంగా ఉంటాయి. మిగిలిన ఏ భారత రాజ్యాంగంలోని అంశాలు కాశ్మీర్ కు వర్తించవని ఆర్టికల్ 370లో రూపొందించారు. కశ్మీరీల పౌరసత్వం - కశ్మీర్ లోని ఆస్తులు భారతీయులు కొనడానికి లేదు. కశ్మీర్ లోని ఆస్తులు కశ్మీరీలే కొనుక్కోవాలి. అక్కడి అమ్మాయిలను ఇతరులు చేసుకోకుండా ఆర్టికల్ లో రూపొందించారు.

*కశ్మీర్ ఆస్తులు - అమ్మాయిలు కశ్మీరీలకే..

కశ్మీర్ కు సొంత రాజ్యాంగం ఉంటుంది. వాళ్లకు రెండు పతాకాలుంటాయి. ఒకటి భారత పతాకం.. రెండోది కాశ్మీర్ రాష్ట్ర పతాకాలు ఉంటాయి. ఇక జమ్మూకశ్మీర్ లోని ప్రజలకు రెండు పౌరసత్వాలుంటాయి. వాళ్లు భారతీయులుగానే కాకుండా కశ్మీర్ పౌరులుగా రెండు పౌరసత్వాలు ఇస్తారు. ఇక కశ్మీర్ లోని ఆస్తులు - అమ్మాయిలు వాళ్లకు వాళ్లే. భారతీయులు అక్కడ ఆస్తులు కొనడానికి ఉండదు.. ఆ అమ్మాయిలను చేసుకోవడానికి ఉండదు. కశ్మీర్ అమ్మాయి ఒకవేళ భారతీయుడిని పెళ్లి చేసుకుంటే ఆమె కశ్మీర్ పౌరసత్వాన్ని కోల్పోతుంది. అదే పాకిస్తానీని పెళ్లి చేసుకుంటే పాకిస్తానీకి భారత పౌరసత్వం లభించేలా ఆర్టికల్ లో పొందుపరిచారు. ఆర్టికల్ 370 ప్రకారం అక్కడ ఉండే కశ్మీరీలకే ఆ భూమిపై, ఆస్తులమీద సర్వహక్కులు ప్రసాదించారు. ఇక భారత్ లో జాతీయ గీతానికి, పతాకానికి అవమానం జరిగితే పెద్ద నేరం. కానీ ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్ లో అవమానం జరిగినా కాల్చేసినా అక్కడ ఏం చర్యలుండవు. ఇక భారత్ లో అత్యవసర ఆర్థిక స్థితి, ఎమర్జెన్సీలు పెట్టినా కశ్మీర్ కు అవి వర్తించకుండా చర్యలు చేపట్టారు. ఇవన్నీ పొందుపరిచాకే జమ్మూకాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తూ నాటి రాజు హరిసింగ్ నిర్ణయం తీసుకున్నారు.

*70ఏళ్ల రావణకాష్టానికి ఆర్టికల్ 370యే కారణం..

ఇలా ఎన్నో ప్రత్యేక హక్కులు - నిబంధనలు - ఆస్తులు - అభివృద్ధి చేయకుండా కశ్మీర్ కు ఆర్టికల్ 370 రక్షణ కల్పించింది. దీన్ని అదునుగా చేసుకొని కశ్మీర్ రాజకీయ పార్టీలు - వేర్పాటువాదులు పాకిస్తాన్ అనుకూల వాదంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ ను దెబ్బతీస్తున్నారు. ఉగ్రవాదంతో అట్టుడికేలా చేస్తున్నారు. అందుకే అక్కడ వేర్పాటువాదం పెరిగి అభివృద్ధి కుంటుపడిందన్న వాదన ఉంది. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 రద్దు చేస్తామంది. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ అమెరికా అధ్యక్షుడిని కలిసి కశ్మీర్ పై మధ్యవర్తిత్వం చేయాలని కోరడంతో కేంద్రం శరవేగంగా కశ్మీర్ ప్రత్యేక హక్కులు రద్దు చేసి అదీ భారత్ లో అంతర్భాగంగా.. ఒక రాష్ట్రంగా చేస్తూ ఆర్టికల్ 370 - 35ఏ లాంటి కశ్మీర్ రక్షణ చట్టాలను నిర్వీర్యం చేసి భారత్ లో పూర్తిగా కలిపేసింది.

*ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కు లాభమేంటి?

ఆర్టికల్ 370 రద్దు - భారత్ లో అంతర్భాగంగా రాష్ట్రాలుగా ‘‘జమ్మూకాశ్మీర్ - లఢఖ్’’ లు విడిపోవడంతో చాలా ప్రయోజనాలున్నాయి. ఇక నుంచి భారత్ లోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా జమ్మూకాశ్మీర్ లో ఆస్తులు - భూములు కొనొచ్చు. అక్కడ అభివృద్ధి కోసం దుకాణాలు - పరిశ్రమలు - రెస్టారెంట్లు - హోటల్స్ ఇలా ఏమైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు..కశ్మీరీల అమ్మాయిలను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ కావచ్చు. భారత రాజ్యాంగం అన్ని రాష్ట్రాల్లో అమలైనట్టే కశ్మీర్ లో కూడా అమలవుతుంది. ఇక నుంచి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన రాష్ట్రంగా ఉంటుంది. అంటే ఢిల్లీలాగా భూమి - రక్షణ కీలక శాఖలు కేంద్రం నిర్వహిస్తుంటుంది. మిగతా వాటికి సీఎంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. అయితే లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇక్కడ కీలకం. ఇక లఢఖ్ పూర్తి కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ అసెంబ్లీ ఉండదు. అన్నీ కేంద్రం పరిధిలో ఉంటుంది. దీంతో జమ్మూకాశ్మీర్ పై భారత్ కు పూర్తి ఆధిపత్యం ఉంటుంది. అభివృద్ధికి - ఉగ్రవాదాన్ని అణచడానికి వీలుచిక్కుతుంది. సుందర కశ్మీరాన్ని ఆవిష్కరించడానికి కేంద్రం వేసి పెద్ద ముందడుగుగా ఆర్టికల్ 370 రద్దును చెప్పవచ్చు