Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే నది దాటాల్సి వస్తే..?

By:  Tupaki Desk   |   10 Sep 2015 2:20 PM GMT
ఎమ్మెల్యే నది దాటాల్సి వస్తే..?
X
అనుకోని పరిస్థితుల్లో నది దాటాల్సి వస్తే..? ఏం చేస్తాం.. అయితే ఈదుకుంటూ ముందుకెళ్లాలి. లేదంటే.. పడవలాంటి దాన్లో ప్రయాణించి దాటేయాలి. సామాన్యులకైతే ఇలాంటి ఆప్షన్ లు మాత్రమే ఉంటాయి. అదే.. ఎమ్మెల్యే కి అయితే..? ఇలాంటి ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారో ఎమ్మెల్యే.

తాజాగా అతగాడు చేసిన చర్యను విన్న వారంతా షాక్ తింటున్న పరిస్థితి. ఇలా కూడా నది దాటొచ్చా? అని తమను తాము ప్రశ్నించుకునే పరిస్థితి. జమ్మూకాశ్మీర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిషన్ లాల్ కు నదిని దాటాల్సి వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. సదరు ఎమ్మెల్యే తన భద్రతాధికారిని తనను నది దాటించాలని ఆదేశించారు.

అక్కడ పడవ లాంటిదేదీ లేకపోవటంతో.. ఎమ్మెల్యే ని తన వీపు మీద ఎక్కించుకొని.. జాగ్రత్తగా నది దాటించేశారు. తన ప్రైవేటు సిబ్బంది చేత చెప్పులు మోయించారు. చెప్పులు మోయించటం ఇప్పుడు ఇష్యూ కాకున్నా.. తన భద్రతా అధికారి వీపు ఎక్కి మరీ నది దాటటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని పై విమర్శలు రావటంతో సదరు ఎమ్మెల్యే తన నోటికి పని చెప్పారు. తన భద్రతాధికారిని తనను నది దాటించేందుకే రమ్మన్నానని.. నది దాటటంలో సాయం తీసుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఎమ్మెల్యేగారి చేష్టకు జమ్మూకాశ్మీర్ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.