Begin typing your search above and press return to search.

జ‌న్‌ ధన్ ఖాతాలతో మందు బాబులు తగ్గారట!

By:  Tupaki Desk   |   16 Oct 2017 2:21 PM GMT
జ‌న్‌ ధన్ ఖాతాలతో మందు బాబులు తగ్గారట!
X
ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా....ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్ర‌వేశ‌పెట్టిన జన్‌ ధన్ యోజన ల‌క్ష్య సాధ‌న‌లో కొత్త ఫ‌లితం వ‌చ్చింది. ఇన్నాళ్లు ఈ ఖాతాలు పేద‌ - మ‌ధ్య‌త‌ర‌గ‌తి వర్గాల‌ను ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల్లో భాగం చేస్తాయ‌ని భావిస్తుండ‌గా తాజాగా ఇంకో ఆవిష్క‌ర‌ణ తెర‌మీద‌కు వ‌చ్చింది. జ‌న్‌ ధ‌న్ వ‌ల్ల ఆల్కహాల్ - పొగాకు వంటి హానికారక ఉత్పత్తుల వాడకం తగ్గిందట. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనమిక్ రీసెర్చ్ వింగ్ చేసిన అధ్యయనం వెల్లడించింది.

జ‌న్‌ ధ‌న్ ఖాతాల విధానం ప్ర‌వేశ‌పెట్టి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా స్టేట్ బ్యాంక్ ఈ అధ్య‌యనం చేసింది. జన్‌ ధన్ అకౌంట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటి వాడకం గణనీయంగా తగ్గినట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. జన్‌ ధన్-ఆధార్-మొబైల్ లింకు వల్ల ప్రభుత్వ సబ్సిడీలు పక్కదారి పట్టడం తగ్గిందని, అందుకే ఇలాంటి అనవసర ఖర్చులు తగ్గినట్లు ఈ స్టడీ తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆల్కహాల్ - పొగాకు వాడకం తగ్గిపోయిందని తేలింది. అయితే ఇదే సమయంలో మెడికల్ ఖర్చులు పెరిగినట్లు గుర్తించారు. బీహార్ - వెస్ట్ బెంగాల్ - మహారాష్ట్ర - రాజస్థాన్‌ లాంటి రాష్ర్టాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నట్లు స్టడీ తేల్చింది. జన్‌ ధన్ ఖాతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం కూడా తగ్గినట్లు ఎస్‌ బీఐ నివేదిక వెల్లడించింది. దీనిని బట్టి ఆర్థికవ్యవస్థ క్రమబద్ధీకరణ జరిగినట్లేనని ఆ నివేదిక స్పష్టంచేసింది.

గతేడాది సెప్టెంబర్‌ లో ద్రవ్యోల్బణం 4.39 శాతంగా ఉండగా.. ఈ ఏడాది అది 3.28 శాతానికి పరిమితమైంది. మూడేళ్ల కిందట జన్‌ ధన్ పథకం ప్రారంభించిన తర్వాత 30 కోట్ల కుటుంబాలు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 4.7 కోట్ల అకౌంట్లు - బీహార్ 3.2 కోట్ల అకౌంట్లు - వెస్ట్ బెంగాల్‌ లో 2.9 కోట్ల అకౌంట్లు తెరిచారు. గ్రామీణ ప్రాంతాల్లోనే 60 శాతం జన్‌ ధన్ ఖాతాలు తెరిచినట్లు అంచనా వేసింది.