Begin typing your search above and press return to search.

‘‘జనగనమణ’’ పాడొద్దంటన్న పద్మభూషణ్

By:  Tupaki Desk   |   22 Feb 2016 4:07 AM GMT
‘‘జనగనమణ’’ పాడొద్దంటన్న పద్మభూషణ్
X
అత్యున్నత పురస్కారాలు అందుకున్న వ్యక్తుల నోటి నుంచి సహజంగా రాని కొన్ని వ్యాఖ్యలు తాజాగా ఓ కవి చేశారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత.. హిందీ కవి అయిన 92 ఏళ్ల గోపాల్ దాస్ నీరజ్ అనే పెద్దాయన సంచలన వ్యాఖ్యలే చేశారు. దేశ జాతీయగీతమైన ‘‘జనగణమణ’ వద్దంటే వద్దని చెబుతున్నారు. ఊరికే మాటలతో కాకుండా.. తాను ఎందుకు వద్దన్న విషయాన్ని వివరంగా చెప్పటంతో పాటు.. ఆయన మాటల్ని విన్న వారు.. పెద్దాయన చెబుతున్న మాటల్లో అర్థం ఉంది కదా? అన్న భావన కలిగేలా ఉన్నాయి.

‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎందుకు వద్దంటున్నారన్నన విషయంలోకి వెళితే.. ఈ గీతం బ్రిటీషర్ల పాలనను గుర్తుకు తెచ్చేలా ఉంటుందని.. అప్పుడెప్పుడో బ్రిటీషర్లు వెళ్లినా.. ఇప్పటికీ వారిని గుర్తు తెచ్చుకొని పాడుకోవటం ఏమిటని? సూటిగా ప్రశ్నిస్తున్నారు.

మనమందరం బానిసలుగా ఉన్నాం.. మన జాతీయ గీతం కూడా మనదేశం బ్రిటీష్ కాలనీగా ఉన్నప్పటిదేనని గుర్తు చేస్తున్నారు. ‘‘ఈ గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో యూకే రాజుగా ఐదోజార్జ్ కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంలో రాశారు. బ్రిటీషర్లు వెళ్లిపోయారు. కానీ.. ఇప్పటికి కొంతమంది బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జనగణమనకు బదులుగా వందేమాతరం కానీ ఝండా ఊంఛే రహే హమారా గీతాల్లో ఏదో ఒకదానికి జాతీయ గీతంగా వాడాలని ఆయన కోరుతున్నారు. ‘‘వందేమాతర గీతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాం. ఈ నినాదంతో ఎంతోమంది ముస్లింలు.. హిందువులు అమరులయ్యారు. జనగణమణలో ‘అధినాయక’ అంటూ నియంత.. ‘‘జయహే భారత భాగ్య విధాత’’ అంటూ దేశ సౌభాక్యగానికి ఆయన విధాత అని అర్థం’’ అంటూ తన వాదనకు సంబంధించిన అసలు విషయాల్ని ప్రస్తావించారు. అంతేకాదు.. జనగణమనలో పేర్కొంటున్న.. ‘‘పంజాబ్ సింధు గుజరాత మరఠా’’లలో సింధ్ ఇప్పుడు భారత్ లో లేదు కదా? అంటూ లాజిక్ తీస్తున్న 92 ఏళ్ల నీరజ్ వాదన వింటే ఈ విషయం మీద మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందనిపించక మానదు.