Begin typing your search above and press return to search.

జానాకు స్థాన‌చ‌ల‌నం.. అలెర్ట్ అయిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   20 Sep 2018 12:15 PM GMT
జానాకు స్థాన‌చ‌ల‌నం.. అలెర్ట్ అయిన కేసీఆర్‌
X
రాజ‌కీయాల్లో ఎత్తుల‌కు పైఎత్తులు మామూలే. తెలివి ఎవ‌రి సొత్తు కాద‌న్న‌ట్లుగా.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాల‌కు చెక్ పెట్టేందుకు వీలుగా కాంగ్రెస్ వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా తామేం త‌ప్పుల్ని చేశామో .. వాటిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఎలాంటి ఒత్తిళ్ల‌కు లొంగ‌కుండా.. గెలుపే ధ్యేయంగా అభ్య‌ర్థుల్ని రంగంలోకి దించాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. బ‌ల‌హీనంగా ఉన్న అభ్య‌ర్థుల్ని ఎట్టి ప‌రిస్థితుల్లో దించ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఆలోచిస్తోంది. ఇప్ప‌టికే గులాబీ అభ్య‌ర్థుల్ని కేసీఆర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. వారికి ధీటైన అభ్య‌ర్థుల్ని రంగంలోకి దించాల‌ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

ఇందుకు త‌గ్గట్లు పాత ప‌ది జిల్లాలకు సంబంధించి ప్ర‌త్యేక వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. జానారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాగార్జున‌సాగ‌ర్ పై ఈ వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ను త‌మ ఖాతాలో వేసుకోవ‌టంలో వైఫ‌ల్యం చెందిన కాంగ్రెస్‌.. ఈసారి ఆ సెంటిమెంట్ ను కూడా ర‌గ‌ల్చాల‌ని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. తెలుగుదేశం.. కోదండం మాష్టారి నేతృత్వంలోని తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీతో పాటు క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తోంది. నాలుగు పార్టీల మ‌హాకూట‌మితో టీఆర్ ఎస్ ను ఎదుర్కోవాల‌న్న‌ది కాంగ్రెస్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఎక్క‌డ ఏ పార్టీ అభ్య‌ర్థి బ‌లంగా ఉంటే.. వారిని మాత్ర‌మే బ‌రిలోకి దించాల‌న్న‌ది కూట‌మి ఆలోచ‌న‌గా చెబుతున్నారు. సీట్ల స‌ర్దుబాటుపై ఇప్ప‌టికి ఒక కొలిక్కి రాన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల షెడ్యూల్ నాటికి ఈ చ‌ర్చ‌లు ఒక ద‌రికి వ‌స్తాయ‌న్న మాట వినిపిస్తోంది.

ఇక‌.. జానారెడ్డి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మిర్యాల‌గూడ‌కు మార్చుకోవాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల సంల‌చ‌నం సృష్టించిన ప్ర‌ణ‌య్ హ‌త్య నేప‌థ్యంలో జానారెడ్డి మిర్యాల‌గూడ‌కు రావ‌టం.. బాధిత కుటుంబాల‌కు ప‌రామ‌ర్శించ‌టం వెనుక రాజ‌కీయ కార‌ణం ఉంద‌ని భావిస్తున్నారు. త‌న‌కు తిరుగులేని నాగార్జున సాగ‌ర్ సీటును త‌న కుమారుడు ర‌ఘువీర్ కు ఇచ్చి.. తాను మిర్యాల‌గూడ బ‌రిలో నుంచి దిగితే.. స‌మీక‌ర‌ణాలు మార‌టంతో పాటు.. గులాబీ ర‌థ‌సార‌ధికి షాకిచ్చే వీలుంద‌ని చెబుతున్నారు. జానా దృష్టి మిర్యాల‌గూడ మీద ప‌డ‌టంతో ఇప్ప‌టికే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. త‌న వ్యూహంపై పున‌రాలోచించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. జానా విష‌యంలో ఏ వ్యూహాన్ని అమ‌లు చేశారో.. ఇదే త‌ర‌హాలో మిగిలిన వారి విష‌యంలోనూ వ్య‌వ‌హ‌రించాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అదే జ‌రిగితే గులాబీ బాస్ కు కొత్త క‌ష్టం వ‌చ్చిన‌ట్లే.