Begin typing your search above and press return to search.

ఎందుకు జానా.. మ‌రీ అంత తొంద‌ర‌ప‌డ‌తారు?

By:  Tupaki Desk   |   17 Aug 2018 6:08 AM GMT
ఎందుకు జానా.. మ‌రీ అంత తొంద‌ర‌ప‌డ‌తారు?
X
ప్ర‌త్య‌ర్థి బ‌లాబ‌లాన్ని అంచ‌నా వేసి గోదాలోకి దిగితే బాగుంటుంది. ప్ర‌త్య‌ర్థి టెక్నిక్ ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి దెబ్బ తీస్తే ఫ‌లితం ఉంటుంది. అంతేకానీ.. అడ్డ బ్యాటింగ్ తో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఆట ఆడేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తి తెలిసిందే. త‌న ప్ర‌యోజ‌నాల‌కు భంగం వాటిల్లేలా వ్య‌వ‌హ‌రిస్తే.. ఏ వ్య‌వ‌స్థ మీద‌నైనా.. ఎంత‌టి వారి మీద‌నైనా స‌రే..నిప్పులు చెరిగేందుకు ఏ మాత్రం వెనుకాడ‌రు.

మ‌రి.. అలాంటి నేతను టార్గెట్ చేయాలంటే ఎంత క‌స‌ర‌త్తు చేయాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా పెద్ద మ‌నిషి అన్న ట్యాగ్ పెట్టుకొని బ‌రిలోకి దిగితే ముఖం ప‌గిలిపోవ‌టం ఖాయం. ఇప్పటికే అలాంటి అనుభ‌వాలెన్నో ఎదుర‌య్యాయి జానారెడ్డికి. పెద్దాయ‌న‌.. పెద్ద మ‌నిషి.. సీనియ‌ర్ నేత ఇలాంటి మాట‌ల్ని చెబుతూనే.. పెద్ద‌మ‌నిషి అన్న‌ది చూడ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మండిప‌డ‌టం గ‌తంలో చూసిందే.

త‌న విలువ‌ను తాను కాపాడుకోవ‌టానికి జాగ్ర‌త్త‌లెన్నో తీసుకోవాల్సి ఉన్నా.. దుర‌దృష్ట‌వ‌శాత్తు జానా అలాంటివేమీ చేయ‌టం లేదు. త‌న ప్ర‌త్య‌ర్థి అధినేత మామూలోడు కాడ‌ని.. చాలా తెలివైనోడ‌న్న విష‌యాన్ని తెలిసినా.. తాను మాట్లాడే మాట‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌టం ఆయ‌న‌కు మ‌రిన్ని తిప్ప‌లు ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశాన్నే చూడండి. కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్ల‌టాన్ని జానా త‌ప్పు ప‌ట్టారు.

ఐదేళ్ల పాటు ఉండాల్సిన ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి.. ముంద‌స్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముందంటూ ఆయ‌న కేసీఆర్ ను ప్ర‌శ్నిస్తున్నారు. మొన్న నిర్వ‌హించిన మీడియా భేటీలో మాట్లాడిన కేసీఆర్ తాను ముంద‌స్తుకు వెళ్ల‌టం లేద‌ని.. చివ‌రి ఆర్నెల్ల‌లో ఎన్నిక‌లు జ‌రిగితే వాటిని ముంద‌స్తు అన‌ర‌న్నారు. డిసెంబ‌రులో ఎన్నిక‌ల‌కు వెళ్లే సంకేతాలు ఇచ్చారే త‌ప్పించి.. ప‌క్కాగా వెళుతున్న‌ట్లుగా మాట వ‌ర‌స‌కు కూడా చెప్ప‌లేదు. అలాంట‌ప్పుడు కేసీఆర్ ముంద‌స్తుకు వెళుతున్న‌ట్లుగా జానా భావించ‌టంలో అర్థం లేదు.

ఓవైపు మోడీని ముంద‌స్తుకు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం స‌వాళ్ల మీద స‌వాళ్లు విసురుతుంటే.. మ‌రోవైపు తెలంగాణ‌లో మాత్రం ముంద‌స్తు (జానా భాష‌లో) అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించ‌టం స‌రికాదుగా. ఇలాంటి వైరుధ్యాల‌పై కేసీఆర్ లాంటి నేత ఏమంటారు? ఏమ‌య్యా పెద్ద మ‌నిషి.. మీ ఢిల్లీ లీడ‌ర్లు ఒక‌లా.. మీరు ఒక‌లా మాట్లాడ‌తారా? మీలో మీకు క్లారిటీ లేదా? అని దుమ్మెత్తి పోయ‌టం ఖాయం. క‌దిలించి మ‌రీ తిట్లు తినేలా జానా వ్య‌వ‌హ‌రిస్తే.. ఆయన పెద్ద‌రికానికి దెబ్బ ప‌డ‌ట‌మే కాదు.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిక‌రంగా మారుతుంది. జానా లాంటోడ్నే ఆడుకుంటున్నాం.. మిగిలినోళ్లు ఎంత‌న్న ధీమాను గులాబీ బ్యాచ్ కు క‌లిగిస్తే న‌ష్టం ఎవ‌రిక‌న్న‌ది కాంగ్రెస్ పెద్ద గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.