Begin typing your search above and press return to search.

ఇక ఆ విష‌యం మాట్లాడ‌న‌ని చెప్పిన జానారెడ్డి

By:  Tupaki Desk   |   17 March 2017 5:34 PM GMT
ఇక ఆ విష‌యం మాట్లాడ‌న‌ని చెప్పిన జానారెడ్డి
X
బడ్జెట్ చర్చ నుంచి నేను తప్పుకొంటున్నా. ఇదే నా ఆఖరి ప్రసంగం. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌ పై నేను మాట్లాడను. మా పార్టీ సభ్యులు చూసుకుంటారు అని ప్రతిపక్ష నేత జానారెడ్డి సంచ‌ల‌న ప్రకటన చేశారు. బడ్జెట్‌ పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం అసహనం వ్యక్తం చేశారు. సభ ప్రారంభంకాగానే జానారెడ్డి బడ్జెట్‌ పై మాట్లాడుతూ.. ఆస్తులు అప్పుల కంటే ఎక్కువ ఉండాలని, లేకుంటే అప్పులు తీర్చే మార్గం లేక భవిష్యత్‌ లో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. డాంబికాలకు పోతే తీరని నష్టం వాటిల్లుతుందని జానారెడ్డి అని అన్నారు.

"వాస్తవానికి విరుద్ధంగా బడ్జెట్ ఉందని ప్రతిపక్షంగా నిలదీస్తుంటే దానికి వక్రభాష్యం చెప్తున్నారు.. ఇదెక్కడి సంస్కృతి? మేం కూడా అధికారంలో ఉండగా ఇలాగే వ్యవహరించాం. అందుకే ఇక్కడ కూర్చున్నాం" అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్‌పై తీసుకున్న పనులు బాగున్నాయని, కొన్ని లోటుపాట్లను కూడా సవరిస్తే మంచి ఫలితాలుంటాయని జానారెడ్డి చెప్పారు. కాగా, జానారెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వింటుంటారని, సభలో లేకున్నా అన్నీ గ్రహించి ముందుకు సాగుతారని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జానారెడ్డి బడ్జెట్‌పై చర్చలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుండగా మధ్యలో మంత్రి రాజేందర్ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రికి అన్నింటిపై అవగాహన ఉందని చెప్పారు. గంటగంటకూ ప్రతీ ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి. ఏమిటీ పరిస్థితి అంటూ రాష్ట్ర ప్రగతిపై సమీక్షిస్తారని ఈటెల‌రాజేంద‌ర్ అన్నారు. వాటిని వేగవంతం చేయడానికి పురమాయిస్తారని చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి బాధ్యతగా అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని ఈటల తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/