Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ పెద్దాయ‌నకు కొత్త‌ కోరిక పుట్టింది

By:  Tupaki Desk   |   16 July 2017 5:01 PM GMT
కాంగ్రెస్‌ పెద్దాయ‌నకు కొత్త‌ కోరిక పుట్టింది
X
విప‌క్ష నేత‌ల్లో మెజార్టీ నేత‌లు అభిమానించే..ఇంకా చెప్పాలంటే అధికార ప‌క్షంలో కూడా అదే స్థాయిలో సానుకూల దృక్ప‌థం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి కొత్త కోరిక పుట్టింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సీఎల్పీ కంటే పీసీసీకే ఎక్కువ పవర్‌ ఉంటుందని ఇటీవల ఆయన తన మద్దతుదారులతో వ్యాఖ్యానించడం ద్వారా త‌న మ‌న‌సులోని భావాల‌ను బ‌య‌ట‌పెట్టినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వివిధ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని పీసీసీ చీఫ్ ప‌ద‌విపై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పగ్గాల కోసం ఢిల్లీలో తనకు తెలిసిన నేతలతో మమ్మురంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

పీసీసీ ర‌థ‌సార‌థిగా జానారెడ్డి ఉంటే పార్టీ బ‌లోపేతానికి చాన్స్ ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో జానారెడ్డి అధ్యక్షుడైతే పార్టీ పరిస్థితి ఇలా ఉండేది కాదని ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో అత్యధిక వయస్సు పైబడిన నాయకులు కొంత మంది ఉన్నా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న సీనియర్లలో ఎస్‌ జైపాల్‌ రెడ్డి - పొన్నాల లక్ష్మయ్య - వి హనుమంతరావు - కె జానారెడ్డి వారితోపాటు మరికొంత మంది నేతలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కొనసాగిన సమయంలో జానారెడ్డి అనేక శాఖల బాధ్యతలు నిర్వహించి రికార్డులకెక్కారు. జైపాల్‌ రెడ్డి కేంద్రంలో మంత్రిగా - ఎంపీ - ఎమ్మెల్యేగా పదవుల్లో కొనసాగారు. పొన్నాల లక్ష్మయ్య పది మాసాలపాటు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. వి హనుమంతరావు ఉమ్మడి రాష్ట్రంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. ఆ నలుగురు రాజకీయాల్లో తలపండిన నేతలుగా గుర్తింపు పొందారు. పొన్నాల - వీహెచ్‌ కు మరోసారి అధ్యక్షులయ్యే చాన్స్‌ లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. జైపాల్‌ రెడ్డి జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. 70 ఏండ్లు వయస్సు ఉండటంతో చివరి అవకాశంగా జానారెడ్డి అధ్యక్షపదవి కోసం సీరియస్‌గా ప్రయత్నాలు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో జరుగుతాయని ఒకరిద్దరు కాంగ్రెస్‌ నేతలు ప్రకటనలు చేశారు. కొంత మంది అధ్యక్షపదవి కోసం ప్రయత్నం చేయడం వల్లే ఉత్తమ్‌ వర్గీయులు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ఎక్కువకాలం రాష్ట్ర మంత్రిగా ఉండటంతో జానాకు అధిష్టానంతో సంబంధాలు అంతగా లేవని కూడా ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవైపు ఆయన ప్రయత్నాలు చేస్తూనే...పార్టీ పైనా పట్టు బిగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించలేదంటూ అసంతృప్తిగా ఉన్న బీసీలను తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇచ్చినా వారంతా ఓడిపోయారని, బలమైన సామాజికవర్గం తమను బదనాం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన వారు సొంత బలంతో గెలిచినట్టు...ఓడినవారు పొన్నాల లక్ష్మయ్య వల్ల ఓడినట్టు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీలను బుజ్జగిస్తున్నారని తెలిసింది. మరో పక్క ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్లే అసెంబ్లీలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదనే అపవాదు నుండి బయటపడేందుకు కూడా ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారని మరికొందరు అంటున్నారు.

ఎమ్మెల్యేలు డీకే అరుణ - సబితా ఇంద్రారెడ్డి - చిన్నారెడ్డి జానా వైపే మొగ్గుచూపుతున్నారని ప్ర‌చారం జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ జైపాల్‌ రెడ్డి మాత్రం కొంత విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉండ‌టమే కార‌ణ‌మ‌ని అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షపదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా జానారెడ్డి విషయంలో పునరాలోచన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వారి పోరాటమంతా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పైనేనని జానారెడ్డి ముందుకు వ‌స్తే త‌మ‌ మద్దతు తెలిపే అవకాశం ఉందని ప్ర‌చారం జరుగుతోంది. రాబోయే ఒక‌ట్రెండు నెల‌ల్లో ఈ విష‌యంలో పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు.