Begin typing your search above and press return to search.

పైశాచిక పాలన అని జానాకు ఇప్పుడు తెలిసిందట

By:  Tupaki Desk   |   30 Jun 2015 5:55 AM GMT
పైశాచిక పాలన అని జానాకు ఇప్పుడు తెలిసిందట
X
ఒక సీనియర్‌ రాజకీయ నేతగా జానారెడ్డి.. హుందాతనానికి పెద్దపీట వేస్తారు. రాజకీయాల్లో ప్రయోజనాల కంటే కూడా సంప్రదాయాలు.. మర్యాదలకే పెద్దపీట వేసే జానారెడ్డి.. అడ్డదిడ్డంగా దూకుడు రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండాలని కోరతారు.

తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్ని బుజ్జగించి.. అప్పుడప్పుడు వారి కోపతాపాలకు గురి అవుతారు కూడా. అలా అని ఆయన తన సిద్ధాంతానికి రాజీ పడరు. అలాంటి జానారెడ్డి.. తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ కానీ మరికొంత కాలం పాటు పరిపాలిస్తే.. తెలంగాణలో ప్రజలు కులాలు.. మతాల వారీగా విడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. తాజాగా ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన.. టీఆర్‌ఎస్‌ అనైతిక పాలన చేస్తుందని దుయ్యబట్టారు.

విపక్షాల్ని అణగదొక్కే క్రమంలో ఉన్నారని.. టీఆర్‌ఎస్‌.. మజ్లిస్‌తో కలిసి గ్రేటర్‌ హైదరాబాద్‌లో పైశాచికత్వంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఎప్పుడూ లేని విధంగా జనారెడ్డి ఇంత గుస్సా ఎందుకయ్యిండు? తన తోటి వారు సీరియస్‌ అయి పెద్దపెద్ద పదాలు వాడుతుంటే అడ్డు చెప్పే ఆయనే.. పైశాచితక్వం లాంటి మాటలు ఎందుకు వచ్చినట్లు? జానాకు అంత కోపానికి గురి చేసిన ఘటన ఏందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.