Begin typing your search above and press return to search.

జానా ప‌ద‌వి ఈ అసెంబ్లీ వ‌ర‌కేనా?

By:  Tupaki Desk   |   1 Dec 2016 8:56 AM GMT
జానా ప‌ద‌వి ఈ అసెంబ్లీ వ‌ర‌కేనా?
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతున్న తరుణంలో అన్ని వేళ్లు సీఎల్‌ పీ నేత జానారెడ్డి వైపే చూస్తున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆయన దారుణంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎల్పీ నేత జానారెడ్డి పనితీరుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ ఎస్‌ పై పోరాటం చేయాల్సింది పోయి ఆ పార్టీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ప‌లు ఉదంతాల‌ను సైతం ప్ర‌స్తావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మాఫియా డాన్‌ నయూం ఎన్‌ కౌంటర్‌ తీరుపై ప్రభుత్వ చర్యలను జానారెడ్డి స్వాగతించారు. తన హయాంలోనే పట్టుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరణ ఇచ్చారు. చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఆయనతో సంబందాలున్నాయని జానారెడ్డి అంతర్గత సంభాషణలలో అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సాగునీటి ప్రాజెక్టుల తీరుపై ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ను ఆయన తప్పు పడుతున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హజరైనప్పటికి జానారెడ్డి మాత్రం హజరు కాకపోవడం పలు విమర్శ లకు తావిస్తోంది. ఈ నేప‌థ్యంలో జానా ప‌ద‌వి మార్పు ఖాయ‌మ‌ని త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ను మారుస్తార‌ని అంటున్నారు.

గత రెండేళ్లుగా కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ ఎస్‌ సర్కార్‌ అనేక వైఫ‌ల్యాలు మూట‌గ‌ట్టుకోవ‌డ‌మే కాకుండా ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన పలు హమీలను విస్మరించింది. అయితే ఇదే అంశాన్ని ప్రజలలోని తీసుకెళ్లడంలో జానారెడ్డి ఘోరంగా విఫలమయ్యారనేది కాంగ్రెస్‌ పెద్దల ఆరోపణ. దీనికి తోడు అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ విజయవంతంగా కొనసాగుతుంది. తొలుత టీడీపీని టార్గెట్‌ చేసిన టీఆర్‌ ఎస్‌ నేతలు ఆ తరువాత తమ దృష్టిని కాంగ్రెస్‌ వైపు మళ్లించారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రేపో, మాపో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ పార్టీ మారుతారన్న ప్రచారం జరగుతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడ కొనసాగే పరిస్థితులు ఉండవు. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ముంచుకు వస్తుండడంతో కాంగ్రెస్‌ పెద్దలు మేల్కొన్నారని సమాచారం. తెలంగాణలో సీనియర్‌ నేతగా ఉన్న జానారెడ్డి వైఖరి వల్లే పార్టీ రోజురోజుకు ఇబ్బందుల పాలవుతుందంటున్న అధి ష్ఠాన పెద్దలు ఆయన మెతక వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే సీఎల్‌ పి నేత మార్పు తప్పదనే సంకేతాలు అధిష్ఠాన పెద్దల నుండి వినపడుతున్నాయి. గుత్తా సుఖేందర్‌ రెడ్డి, బాస్కర్‌ రావు తదితరులు పార్టీ మారే సందర్బంలోను జానారెడ్డి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన కూడ తాను తప్పుకునేందుకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. ఇంతలోనే ఏఐసీసీ వ్యవహరాల ఇంఛార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ ఆయన సముదాయించారు. కానీ వివిద వర్గాల నుండి దీనిపై నివేదికలు తెప్పించుకున్న అధిష్ఠానం చివరకు జానారెడ్డిని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

సీఎల్పీ నేతగా జానారెడ్డి రాజీనామా చేసిన పక్షంలో ఈ పదవిని సమర్థవంతమైన నాయకుడికి అప్పగించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం నల్గొండ జిల్లాకే చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్టీ సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌యిన గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, డికె అరుణ పోటీపడుతున్నారు. తనకు అవకాశం ఇస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అధిష్ఠాన పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే పీసీసీ చీఫ్‌ నల్గొండ జిల్లాకే చెందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉండడంతో ఆయనకు అవకాశం ఇవ్వకుండా పాలమూరు కు చెందిన డీకే అరుణ - కరీంనగర్‌ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిల పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీస్తున్నట్లు స‌మాచారం. పీఏసీ ఛైర్మన్‌ గా ఉన్న గీతారెడ్డి పేరు కూడ చర్చకు వచ్చినప్పటికి ఆమె ఆసక్తిగా లేరని సమాచారం. దీంతో వీరిద్దరిలో ఒకరికి సిఎల్‌పి పదవిని అప్పగిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/