Begin typing your search above and press return to search.

బాబును జానారెడ్డి ఎందుకు కలిశారు?

By:  Tupaki Desk   |   22 March 2016 7:57 AM GMT
బాబును జానారెడ్డి ఎందుకు కలిశారు?
X
ఒకరిది ఏపీ, ఇంకొకరిది తెలంగాణ.. ఒకరిది టీడీపీ - ఇంకొకరిది కాంగ్రెస్. ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరు పొరుగు రాష్ర్టంలో విపక్ష శాసనసభా పక్ష నేత. కలిసి ముచ్చట్లాడుకోవడానికి... మీటింగులు పెట్టుకోవడానికి పెద్దగా మ్యాటరేమీ లేదు. కానీ, ఇద్దరూ భేటీ అయ్యారు. దీంతో ఈ విషయం రెండు రాష్ర్టాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి భేటీకి వ్యక్తిగత అంశాలు కారణాలా లేదంటే రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబునాయుడును.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత - తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత అయిన జానారెడ్డి కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని చంద్రబాబు చాంబర్ కు వెళ్లిన జానా ఆయనతో చాలాసేపు భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చిందన్నది తెలియకపోయినా ఏదో ముఖ్యమైన వ్యవహారం లేకుండా జానా ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబును కలిసే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది.

కాగా ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ - కాంగ్రెస్ రెండు పార్టీలూ ప్రతిపక్షంలోనే ఉన్నాయి. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం చాలా కష్టాల్లో ఉంది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆరెస్ ఎగరేసుకువెళ్లిపోవడంతో పూర్తిగా దెబ్బతింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలను టీఆరెస్ ఇప్పటికే ఆకర్షించింది. మిగతావారినీ ఆకర్షించే అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో టీ అసెంబ్లీలో జానారెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై జోరు పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆరెస్ ను నిలువరించేందుకు టీడీపీతో కలిసి సాగేలా జానా ఏమైనా ప్రతిపాదన చేశారా అన్న చర్చ జరుగుతోంది.

లేదంటే ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు జిల్లా అయిన నల్గొండ జానాకు సొంత జిల్లా కావడంతో అటువైపు ఏపీలో జానాకు ఏమైనా ముఖ్యమైన పనులుండి కలిశారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.