Begin typing your search above and press return to search.

సీఎం ఎవరైనా... జానాదీ అదే రేంజట

By:  Tupaki Desk   |   24 Jun 2016 12:02 PM GMT
సీఎం ఎవరైనా... జానాదీ అదే రేంజట
X
తెలంగాణ రాష్ర్టం ఏర్పడి టీఆరెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు చాలామంది టీఆరెస్ లోకి వెళ్లిపోయారు. ఎంపీలు - ఎమ్మెల్యేలు కూడా గులాబీ కండువా వేసుకున్నారు. ఒక దశలో జానారెడ్డి కూడా గులాబీ గూటికి చేరుతారని అంతా భావించారు. శాసనసభలో ఆయన వైఖరి కూడా స్వపక్షం కాంగ్రెస్ కు అనుకూలంగా కాకుండా అధికార పక్షం టీఆరెస్ కు అనుకూలంగా ఉండేలా చాలాసార్లు కనిపించడంతో ఆయన వైఖరిపై విమర్శలు వచ్చేవి. అలాంటి జానా కొన్నాళ్లుగా మారారు. ఇప్పుడు ఆయన పాలక టీఆరెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే నేనే సీఎం అని తాజాగా ప్రకటించేశారు కూడా. దీంతో జానారెడ్డి మనసులోని కోరికను బయటపెట్టినట్లయింది.

నల్గొండ జిల్లా హాలియాలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జానారెడ్డి... దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది - తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సీఎంతో సమాన హోదా ఉన్న ఏకైక నాయకుడిని తానేనని జానారెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో కార్యకర్తల్లో ఒక్కసారిగా హుషారొచ్చింది.

అయితే.. జానా తొలిసారిగా ఇలా నేనే సీఎం అని చెప్పుకొన్న సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి జానాకు ఇప్పటికే దీనిపై హామీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. ఆ హామీతోనే జానా టీఆరెస్ లోకి వెళ్లే ఆలోచన మానుకుని కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.