Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంగ్రెస్ కి ఊపు..జానారెడ్డి పాదయాత్ర?

By:  Tupaki Desk   |   20 July 2017 8:36 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ కి ఊపు..జానారెడ్డి పాదయాత్ర?
X
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని పార్టీలూ రెడీ అవుతున్నాయి. ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే సమర నాదం మోగించారు. అక్టోబరు నుంచి పాదయాత్రకు ఆయన రెడీ అవుతున్నారు. దాన్ని తట్టుకునేందుకు టీడీపీ కూడా ఏదో ఒక యాత్ర చేయాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. పాలక టీఆరెస్ ను తట్టుకుని ఎన్నికలకు ధీటుగా వెళ్లాలంటే భారీ ప్రణాళిక తప్పదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా సమచారం. ఆ బాధ్యత సీనియర్లే భుజానికెత్తుకోవాలని భావిస్తూ సీనియర్ లీడర్ జానారెడ్డి అందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని తలపోస్తున్నట్లుగా సమాచారం.

పీసీసీ ప‌ద‌విపై క‌న్నేసిన జానారెడ్డి త్వ‌ర‌లోనే పాదయాత్ర చేప‌ట్ట‌బోతున్నార‌ని తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. 2004 ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్‌ - 2014 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు పాద‌యాత్ర‌ల‌తో అధికారంలోకి వ‌చ్చార‌ని... ఏపీలో జగన్ కు కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అదే సలహా ఇచ్చారని... ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయం అందించడానికి.. తద్వారా ముఖ్య పదవులు అందుకోవడానికి కూడా పాదయాత్రకు మించిన మార్గం లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తాను కూడా పాదయాత్ర చేస్తే కలిసొస్తుందని జానా తన అనుచరుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సాధ్య‌సాధ్యాలని ప‌రిశీలించాల‌ని త‌న అనుంగు నేత‌ల‌ను ఆదేశించార‌ట‌.

అయితే... పాదయాత్ర ఎప్పుడు చేయాలని... అందుకు గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేయాలి.. ఏఏ అంశాలు ఎత్తుకోవాలి.. తన పాదయాత్రకు కౌంటర్ గా అధికార పక్షం ఏం చేయొచ్చు.. అప్పుడే తానేం చేయాలి వంటివన్నీ జానా ప్రణాళిక గీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పార్టీని అధికారంలోకి తేవడానికి, పార్టీలోని ఇతర నాయకులను ఓవర్ టేక్ చేసి సీఎం పోస్టును అందుకోవడానికి పాదయాత్ర తప్పదని ఆయన డిసైడనట్లు తెలుస్తోంది.