Begin typing your search above and press return to search.

అమెరికా రిజ‌ల్టే తెలంగాణ‌లోను

By:  Tupaki Desk   |   9 Nov 2016 11:55 AM GMT
అమెరికా రిజ‌ల్టే తెలంగాణ‌లోను
X
అమెరికాలో ఇప్పుడు వ‌చ్చిన ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌.. తెలంగాణ‌లోనూ పున‌రావృత‌మ‌వుతుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానా రెడ్డి జోస్యం చెప్పారు. వాస్త‌వానికి అమెరికాలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌ల‌య్యాక అంద‌రూ హిల్ల‌రీ క్లింట‌న్ గెలుపు ఖాయ‌మ‌ని చెబుతూ వ‌చ్చారు. అదేవిధంగా ట్రంప్ వేడి అంతంత మాత్ర‌మేన‌ని అన్నారు. అస‌లు ఆయ‌న‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని మీడియా సైతం పేర్కొంది. అయితే, అనూహ్యంగా ఎన్నిక‌ల రిజ‌ల్ట్ రివ‌ర్స్ అయింది. ట్రంప్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టే విజ‌యం సాధించారు.

ఇప్పుడు ఇదే విష‌యాన్ని జానా రెడ్డి ఉటంకించారు. అమెరికా ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలిచిన వెంట‌నే ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుత‌మున్న కేసీఆర్ ప్ర‌భుత్వం హిల్ల‌రీ మాదిరిగా పెద్ద ఎత్తున ప్ర‌చారం పొందుతోంద‌ని, అయితే, ట్రంప్ మాదిరిగా తాము విజ‌యం సాధిస్తామ‌ని జానా చెప్పారు. వాస్త‌వానికి కేసీఆర్ పాల‌న ఏమంతా బాగాలేద‌ని అన్నారు. ప్ర‌స్తుతం తాము సైలెంట్‌గా ఉన్నా రానున్న 2019 ఎన్నిక‌ల్లో మాత్రం విజృంభించ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కి ప‌ట్టంక‌డ‌తార‌ని జానా జోస్యం చెప్పారు.

కేసీఆర్ ప్ర‌భుత్వం అన్నీ మంచిప‌నులే చేప‌డుతోంద‌ని, ఆ ప్ర‌భుత్వం బాగుంద‌ని వార్తలు రాయ‌డం వ‌క్రీక‌ర‌ణగా పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో.. కేసీఆర్ స‌ర్కారును మెచ్చ‌కున్న‌ట్టు త‌న‌పై వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌ను సైతం ఈ మాజీ మంత్రి ఖండించారు. తాను కాంగ్రెస్ నేత‌న‌ని, తాను కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా మెచ్చుకుంటాన‌ని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అలాంటి వార్త‌ల్లో నిజం లేద‌ని చెప్పారు జానా రెడ్డి. సో.. ఏదేమైనా 2019లో ట్రంప్ మాదిరి తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెప్పిన జానా వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/