Begin typing your search above and press return to search.

ఒకేసారి ఇద్దర్ని ఏసుకున్న జానా?

By:  Tupaki Desk   |   17 March 2016 4:43 AM GMT
ఒకేసారి ఇద్దర్ని ఏసుకున్న జానా?
X
తెలంగాణ అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేత ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాత్రమే. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జానారెడ్డిని ‘అన్నా’ అని అనాల్సిందే. తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జానా మాటలపై కొందరు కామెడీ చేస్తుంటారు. కానీ.. నిశితంగా పరిశీలిస్తే జానా మాటల్లో చాలా డెప్తు ఉంటుంది. పాతతరం రాజకీయాలకు నేతృత్వం వహిస్తున్న ఆఖరి వ్యక్తిగా జానారెడ్డిగా చెప్పాలి. అలాంటి వ్యక్తి నుంచి దూకుడు రాజకీయాలు ఆశించలేం. అది సరైన పద్ధతి కూడా కాదు.

దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరైన టీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. వారికి ధీటుగా వ్యవహరించేలా శాసనసభాపక్ష నేత ఉండాలని విపక్షం కోరుకోవటం ఇప్పటి కాలానికి సబబే అన్న భావన వ్యక్తమవుతుంది. అయితే.. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో జానారెడ్డి ప్రసంగం వింటే.. దూకుడుగా మాట్లాడటం.. ఆవేశంతో ఊగిపోయి మాట్లాడితే వచ్చే ప్రయోజనం కంటే.. ఆలోచనతో చేసే విమర్శల పదును ఎక్కువన్న విషయం అర్థమవుతుంది. బడ్జెట్ మీద చర్చ సందర్భంగా జానారెడ్డి చేసిన ప్రసంగంలోకి కొన్ని మాటల్ని తీసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థం కాక మానదు.

‘‘నేను అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడతా. ప్రతిపక్ష నేతగా ఆవేశంతో.. దూకుడుగా పోలేకపోతున్నానని మావాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాను. వాస్తవాలు చెప్పినందుకు మీతో (తెలంగాణ అధికారపక్షం) బాధ. ఒకేసారి రెండు బాధలు పడాల్సి వస్తోంది. పరుష పదాల్ని ఉపయోగించి.. అహంకారంతో నాకెవరూ సాటిలేరన్నట్లు.. హావభావాలతో మాట్లాడటం నాకు రాదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని భావిస్తా. నేను చెప్పే వాస్తవాలను కఠోర సత్యాలుగా గుర్తించాలి. లేదంటే కాలానుగుణంగా నేర్చుకుంటారు. అయినా.. నేను చెప్పినవి ఎట్లాగూ చేయరు కాబట్టి వారు (టీఆర్ ఎస్ నేతలు) వినకున్నా ఏమీ కాదు’’ అంటూ సొంతోళ్లను.. అధికారపక్ష నేతల్ని ఒకే రౌండ్ లో జానా ఏసుకున్నారు. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లోనూ జానా మాటలు ఎలా ఉన్నాయో చూశారా? ఈ వ్యాఖ్యల అనంతరం బడ్జెట్ లో లొసగులను ఏకి పారేశారు. ఎక్కడ ఎలాంటి తప్పులు చేశారో అందరికీ అర్థమయ్యేలా జానా వివరించారు. బడ్జెట్ లో చేసిన మాయలను బయటపెట్టారు.