Begin typing your search above and press return to search.
సీట్ల పెంపుపై జానాకు నమ్మకం లేదండోయ్!
By: Tupaki Desk | 31 Jan 2018 10:12 AM GMT2019 ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్షంలో ఉన్న పార్టీలు.. తుదపరి ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత మేలు అనుకోవడం సహజం. అదే సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి నిర్దేశిత సమయానికే ఎన్నిలు రావాలిన అధికార పార్టీలు కోరుకోవడం సహజం. ఇప్పుడు కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మొన్నటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలనే సెమీ ఫైనల్స్ గా భావించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సార్వత్రిక ఎన్నికలకు కష్టపడిన చందంగా కష్టపడిపోయారు. కొంత మేర ఫలితాలను కూడా ఆయన సాధించారనుకోండి. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. రాహుల్ కు పోటీగా ప్రచారం చేసిన ఆయన బీజేపీని పరువును కాపాడారనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... అటు టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గానీ, ఇటు టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గానీ... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామన్న కోణంలోనే వ్యవహరిస్తున్నారు.
అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా సర్వే సంస్థలను రంగంలోకి దించేసి వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఎలా ఉండనుందన్న అంశాలపైనా విశ్లేషణ చేయించుకుంటున్నారు. ప్రతికూల ప్రభావం కనిపించే నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఇద్దరు చంద్రుళ్లు... వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అన్న సర్వే మాటను తెలుసుకుని లోలోపలే ఖుషీఖుషీగానే ఉన్నారని చెప్పాలి. అంతేకాకుండా తాము ఎంతో కాలంగా జరగాలని కోరుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఇప్పుడు కేంద్రం స్పందించిన తీరు కూడా వారిని అమితాశ్చర్యంలో ముంచేసిందనే చెప్పాలి. రెండు అధికార పార్టీలకు సంతోషం కలిగే విషయమంటే.. విపక్షాలకు నచ్చని అంశమేనని చెప్పక తప్పదు కదా. ఈ మాట నిజమేనన్నట్లుగా సీట్ల సంఖ్య పెంపుపై కేంద్రంలో స్పందన వచ్చిందన్న వార్తలు వెలువడగానే... కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన టీ కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి - తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఉన్న కుందూరు జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియా ముందుకు వచ్చీరాగానే...ఎన్నికలకు సంబంధించి తాము ఇప్పటికే సర్వం సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన జానారెడ్డి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని, రంగంలోకి దిగేస్తామని కూడా చెప్పేశారు. ఆ తర్వాత సీట్ల పెంపుపై స్పందించిన జానారెడ్డి... తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు సమయం దగ్గరపడటం, అదే సమయంలో సీట్ల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలకు చాలా సమయమే పడుతుండటం వంటి అంశాలను ప్రస్తావించిన జానా... వచ్చే ఎన్నికల్లోగా తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాదని భావిస్తున్నానని తెలిపారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పిన జానా... సీట్లు పెరిగినా, ఇప్పుడున్న సీట్లతోనే ఎన్నికలు జరిగినా... సత్తా చాటేది మాత్రం తామేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు.