Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యేకి డబ్బా కొట్టడం బాగా తెలుసు
By: Tupaki Desk | 9 Nov 2017 5:20 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించడం, వచ్చే ఎన్నికల్లో తాము టీఆర్ ఎస్ తో కలిసి ఎన్నికలు వెళతామన్న ప్రకటనపై రాజకీయవర్గాల్లో జోరుగానే చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి చిన్నదని అక్బరుద్దీన్ కామెంట్ చేయడం ఆశ్చర్యకరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సీఎల్పీ నేత - సీనియర్ నాయకుడు జానారెడ్డి స్పందించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ ముగిసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అక్బరుద్దీన్ కామెంట్లను క్యాజువల్ గా తీసుకోవడమే కాకుండా టేకిట్ ఈజీ కామెంట్లు చేశారు. అక్బరుద్దీన్ ప్రభుత్వానికి డబ్బా కొట్టడంలో కొత్తేమీ లేదని అన్నారు. గతంలో తమకు అనుకూలంగా కూడా ఆయన మాట్లాడారని జానారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఎంఐఎం తమతోనే ఉంటుందని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎపిసోడ్ పై స్పందించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన కోమటిరెడ్డి అక్బరుద్దీన్ టీఆర్ ఎస్ ను పొగుడుతూ కాంగ్రెస్ ను తిడుతుంటే అభ్యంతరం చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. సీఎల్పీ నేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి అభ్యంతరం చెప్పాల్సి ఉండేదని అన్నారు. 26 మంది సభ్యులతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీజేఆర్ అసెంబ్లీని గడగడలాడించారని, ఇప్పుడా పరిస్థితి అంతా మారిపోయింది పద్దతి లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండలో సీఎం పోటీ చేసినా తనకే ఆధిక్యం వస్తుందన్న కోమటిరెడ్డి.. ఈ మూడేళ్లలో కేసీఆర్ కేవలం గజ్వేల్ - సిద్దిపేటనే అభివృద్ధి చేశారన్నారు. మూడేళ్లలో నల్గొండకు ఏమీ చేయని వారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు తెలుసునని, ఇప్పటికైనా నల్గొండను అభివృద్ధి చేస్తామంటే స్వాగతిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.