Begin typing your search above and press return to search.

చర్చించుకోవాలే కానీ చులకన వద్దంటున్నాడు

By:  Tupaki Desk   |   5 Jun 2016 6:06 AM GMT
చర్చించుకోవాలే కానీ చులకన వద్దంటున్నాడు
X
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే చాలు.. తమకిక తిరుగు ఉండదని తక్కువలో తక్కువ దశాబ్ద కాలం పాటు తమ హవా నడుస్తుదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందు గొప్పలు చెప్పుకోవటం చరిత్ర. తమలాంటి బలమైన నాయకులు ఇంతమంది ఉన్నప్పుడు టీఆర్ ఎస్ లాంటి ప్రాంతీయపార్టీని కలుపుకోవాల్సిన అవసరం ఉండదని.. తెలంగాణ సాధనతో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ ఎస్ ఛరిష్మా తగ్గుతుందంటూ కాకిలెక్కలు చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలతో సోనియమ్మ సరేననటం.. దానికి ఫలితంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతుందన్నది ఇప్పుడు చూస్తున్నదే. తెలంగాణ ఇస్తే చాలు.. తమకిక తిరుగు ఉండదని జబ్బలు చరిచిన నేతలంతా కేసీఆర్ వ్యూహాలకు తెల్లముఖం వేస్తున్న పరిస్థితి. ఆయన్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తల పట్టుకుంటున్న దుస్థితి. మొన్నటి వరకూ మిగిలిన పార్టీ మీద సంధించిన ఆపరేషన్ ఆకర్ష్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ ఎక్కుపెట్టటం.. దీనికి తగ్గట్లే బలమైన నేతలు కారు ఎక్కేందుకు క్యూ కడుతున్న వైనం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పార్టీ నుంచి వెళుతున్న సమయంలో సముచిత కారణాలు చూపించి వెళ్లిపోవటం చాలామంది నేతలు చేసేదే. అలాంటి పనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని.. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మీద ఘాటైన విమర్శలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన విమర్శలకు జానా స్పందించారు.

పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు తాను బాధపడుతున్నానని.. బేధాభిప్రాయాలు ఉంటే కూర్చొని.. చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలే కానీ ఒకరినొకరు చులకన చేసుకునేలా మాట్లాడుకోకూడదంటూ హితవు పలికారు. వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలు సరికావని అభిప్రాయ పడిన జానా.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఇబ్బంది తెచ్చే పరిస్థితి కల్పించకూడదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జానారెడ్డి మాటల్ని విని బుద్దిగా మారే కాంగ్రెస్ నేతలు ఉంటారా..? అలాంటిదే ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు కదా.