Begin typing your search above and press return to search.

రేవంత్ కాదట... మరి బాహుబలి ఎవరంటే...

By:  Tupaki Desk   |   31 Oct 2017 2:14 PM GMT
రేవంత్ కాదట... మరి బాహుబలి ఎవరంటే...
X
రాజకీయ పరిణామాలు తెలంగాణలో నాయకుల్లో గుబులు రేకెత్తిస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తావనకు తెచ్చారు. రేవంత్ రెడ్డి తన అనుయాయులతో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జానారెడ్డి మనసులో మాట బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే రేవంత్ రెడ్డిని ముఖ్యంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారేమోననే అనుమానంతో బీజేపీ వ్యవస్థాపకుడు లాల్ కృష్ణ అద్వానీలా మిగిలిపోతాననే భావన జానారెడ్డిలో వ్యక్తమైంది.

పార్టీలో చేరగానే సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డిని బాహుబలితో పోల్చి ట్వీట్ చేశారు. సినీ బాహుబలి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో నోట్ల వర్షం కురిపిస్తే... రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాహుబలిగా ఓట్ల వర్షం కురిపిస్తాడనే అభిప్రాయంతో ట్వీట్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ కురువృద్ధులు జానారెడ్డి బాహుబలిపై వివరణ ఇచ్చారు. పార్టీలో చేరిపోగానే బాహుబలి కారు. పార్టీని గెలిపించినోడే బాహుబలి. శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటేనే బాహుబలి అనిపించుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే జానా లో సీఎం పదవిపై ఆశ మాత్రం పోలేదు. గతంలో ఏదో ఒక సమీకరణలో తాను సీఎం అయిపోతానని కొత్త బట్టలు కూడా కుట్టించుకుని చాన్నాళ్లు ఎదురు చూసిన జానారెడ్డి ఇప్పటికీ అదే కోరికతో ఉన్నట్లుంది. 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చినపుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని అడగను. పార్టీలో అందరూ కలసి సమ్మతించి ఇస్తే పదవి చేపడతామని జానారెడ్డి మనసులో మాట చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి తన చాతుర్యంతో రాజకీయాల్లో చక్రం తిప్పగలడనే విశ్వాసం రాహుల్ గాంధీకి కలిగించారు. తెలంగాణలో టిఆర్ ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తనలోనే ఉందని రేవంత్ రెడ్డి తొలిరోజే నిరూపించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో నిర్వహించనున్న భారీ బహిరంగలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. సభ విజయవంతం చేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రకంపనలు సృష్టించబోతోందనే సంకేతాలను రేవంత్ రెడ్డి నిరూపణకు సన్నాహాలు చేస్తున్నారు. తన వెంట ముఖ్యనాయకులతో ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో తీర్థం పుచ్చుకున్న తర్వాత బాహుబలి ప్రస్తావన తెలంగాణలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతస్వామ్యం ఉంటొందని పదవులపై అందరికీ ఆశ ఉన్నా... అధిష్టానవర్గ ఆదేశానుసారం నడుచుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి ఉన్నమాటను చెప్పకనే చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో పునరేకీకరణ పేరుతో ఓ కొత్త ఆటమొదలైంది. ఈ ఆటతీరు... రాజకీయ కోవిధుల పంధా ఏ తీరాన్ని చేరుస్తుందో చూడాలి మరి.