Begin typing your search above and press return to search.

కొడుకు సంగతి చెబితే బాగుండేది జానా?

By:  Tupaki Desk   |   29 April 2016 5:30 AM GMT
కొడుకు సంగతి చెబితే బాగుండేది జానా?
X
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జానారెడ్డి స్టైల్ కాస్త భిన్నమన్న సంగతి తెలిసిందే. అర్థం కానట్లుగా మాట్లాడినట్లు ఉంటుంది కానీ.. అదంతా కూడా ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగా చెప్పొచ్చు. మిగిలిన నేతలతో పోలిస్తే జానారెడ్డి మాటలు వినేందుకు కాస్త కష్టంగా.. క్లిష్టంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ.. అసలు లెక్క వేరని చెప్పాలి. ఎందుకంటే..ఏదైనా విషయాన్నిసూటిగా చెప్పాలని జానారెడ్డి భావిస్తే.. ఆ విషయాన్ని నేరుగా చెప్పేస్తారు. అదే సమయంలో కాస్త మార్చి.. మార్చి.. తిప్పి.. తిప్పి చెప్పాలనుకుంటే ఎదుటోడికి చుక్కలు కనిపించాల్సిందే.

జానారెడ్డితో రెగ్యులర్ గా మాట్లాడే వారందరికి ఆ కిటుకు తెలుసు. అలాంటి జానారెడ్డి తాజాగా నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను చెప్పాలనుకున్న విషయాల్ని సూటిగా చెప్పేశారు. తాను పార్టీ మారనున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి వేసిన ఆయన.. తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ తాను పార్టీ మారే ఛాన్స్ లేదని తేల్చేశారు. అంతేకాదు.. తానుపార్టీ మారతానని వస్తున్న వార్తల వెనుక కారణం వేరే ఉందని.. అదంతా తెలంగాణ అధికారపక్షం మైండ్ గేమ్ లో భాగంగా అభివర్ణించారు.

తనపై జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించి ఉండాల్సిందన్న విషయాన్ని జానారెడ్డి సూటిగా చెప్పేశారు. సీఎల్పీ నేతగా తన నాయకత్వంపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న ఆయన.. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించటానికి సుప్రీంకోర్టు వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

జానారెడ్డి చెప్పిన ఈ మాటలన్నీ బాగానే ఉన్నా.. ఒక్క విషయం మీదనే స్పష్టత రాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పట్ల జానారెడ్డి కమిట్ మెంట్ ను ఎవరూ ప్రశ్నించలేనిది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. సమస్య అంతా ఆయన కొడుకు మీదనే. 2019లో జరిగే ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు టీఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం బలంగా సాగుతోంది. మిగిలిన అంశాల మీద స్పష్టత ఇచ్చినట్లే.. తన కుమారుడి మీద వస్తున్న రాజకీయ వార్తల మీద కూడా కాస్త స్పష్టత ఇస్తే బాగుండేది.