Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ పోల్..కాంగ్రెస్ కు బీజేపీ షాకేనా?

By:  Tupaki Desk   |   22 Sep 2019 4:40 AM GMT
హుజూర్ నగర్ పోల్..కాంగ్రెస్ కు బీజేపీ షాకేనా?
X
తెలంగాణలో కాంగ్రెస్ ను భర్తీ చేసి టీఆర్ ఎస్ కు ప్రత్యామ్మాయం మేమే అని ప్రకటిస్తున్న బీజేపీకి అసలు పరీక్ష ఎదురవుతోంది. హుజూర్ నగర్ బైపోల్ తో తొలి పరీక్షను కమలదళం ఎదుర్కోబోతోంది. నిజానికి హుజూర్ నగర్ పోటీ కాంగ్రెస్ - టీఆర్ ఎస్ మధ్యనే. ఆ రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. మరి తెలంగాణపై జెండా ఎగురవేస్తామని కలలు గంటున్న బీజేపీకి చాన్స్ లేదని అంతా భవిస్తున్న వేళ తెరపైకి కొత్త పేరు వచ్చింది. దీంతో బీజేపీ కూడా హుజూర్ నగర్ లో ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తిగా మారింది.

2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయింది. ఎంత ఘోరం అంటే నోటాకు 1621 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన భాగ్యారెడ్డికి కేవలం 1555 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటా కంటే కూడా తక్కువ వచ్చిన బీజేపీ ఇప్పుడు హుజూర్ నగర్ లో అసలు పోటీనే కాదని కాంగ్రెస్ - టీఆర్ ఎస్ లు భావించాయి. మళ్లీ ఓడిన బీజేపీ అభ్యర్థి భాగ్యారెడ్డికే టికెట్ అని అంతా భావించారు..

కాంగ్రెస్ నుంచి పద్మావతి - టీఆర్ ఎస్ నుంచి సైదిరెడ్డి.. మరి బీజేపీ తరుపుముక్క ఎవరు? అని ఆలోచిస్తున్న వేళ బీజేపీ బలమైన అభ్యర్థి కోసం రంగంలోకి దిగిందట.. కాంగ్రెస్ - టీఆర్ ఎస్ నేతలిద్దరూ రెడ్డీలే.. దీంతో అదే రెడ్డి సామాజికవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపుతోందట...

బీజేపీ నుంచి అనూహ్యంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడి పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం బలం పుంజుకున్న బీజేపీ ఇక్కడ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న - ఆర్థికంగా మంచి స్థితిమంతుడు - జానారెడ్డి కుమారుడైన రఘువీర్ ను అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తోంది. రఘువీర్ రెడ్డి బీజేపీ తరుఫున నిలబెట్టేందుకు సంప్రదింపులు సాగిస్తున్నట్టు తెలిసింది.. కాంగ్రెస్ ఓట్లను చీల్చి గెలవాలని ప్లాన్ చేస్తోంది.

అయితే తండ్రి కాంగ్రెస్ వాది కావడంతో కొడుకు బీజేపీలోకి వెళ్లి పోటీచేయడానికి జానారెడ్డి ఒప్పుకునే అవకాశాలు లేవు. తండ్రిని విభేదించి బయటకు వస్తేనే రఘువీర్ రెడ్డికి బీజేపీ టికెట్ దక్కుతుంది. రాజకీయ అవకాశమా.? తండ్రి మాటనా అన్న మీమాంసలో ప్రస్తుతం రఘువీర్ రెడ్డి ఉన్నారట.. బీజేపీ ఆఫర్ ను కనుక జానారెడ్డి కొడుకు అందిపుచ్చుకుంటే జానాతోపాటు కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలినట్టే. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీ గండికొట్టే అవకాశాలు బాగా పెరుగుతాయి.