Begin typing your search above and press return to search.

అదృష్టమంటే కేసీఆర్ దే..?

By:  Tupaki Desk   |   16 Sep 2015 6:23 AM GMT
అదృష్టమంటే కేసీఆర్ దే..?
X
అదృష్టమంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దే. సమకాలీన రాజకీయాల్లో మంచి చేసినా తప్పు చేశారంటూ తిట్టిపోయటం.. ఏం చేసినా.. తమ కోణంలో అందులో బొక్కలు వెతకటం కనిపిస్తుంది. కానీ.. అందుకు భిన్నంగా హుందా రాజకీయాలంటూ సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నేత.. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి రూటే సపరేటు.

ఏ చిన్న అవకాశం చిక్కినా విపక్ష నేత హోదాలో ఉన్న వారు అధికారపక్షంపై విరుచుకుపడుతుంటారు. తీవ్ర విమర్శలు చేస్తూ.. మండిపడుతుంటారు. అధికారపక్షంలో ఉన్న వారి చేతకానితనాన్ని వేలెత్తి చూపిస్తూ తిట్టిపోస్తుంటారు. అయితే.. అలాంటి వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్న జానారెడ్డి సాబ్. సమకాలీన దూకుడు రాజకీయాలు తనకు వంటబట్టవంటూ క్లియర్ గా చెప్పేయటమే కాదు.. పార్టీని దెబ్బ తీస్తున్నా ఆయన మాత్రం పెద్దగా పెదవి విప్పటం లేదు.

తాజాగా చూస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ రెండో స్థానంలో నిలవటం తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక పాలసీగా తెలంగాణ రాష్ట్రం చెబుతున్నా.. ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో మాత్రం పదమూడో ర్యాంకు ఇవ్వటంపై తెలంగాణ అధికారపక్షం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఇలాంటి సమయంలో ఏ విపక్ష నేత అయినా ఏం చేస్తారు? తెలంగాణ అధికారపక్షం చేతకానితనాన్ని నిలదీస్తారు. ఇదేం పద్ధతని ప్రశ్నిస్తారు. అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయిందని దుమ్మెత్తిపోస్తారు. కానీ.. జానారెడ్డి మాత్రం అందుకు భిన్నం. తన పార్టీకి చెందిన నేతల్ని ఓవైపు తీసుకుపోతున్నా.. విమర్శలు చేసే విషయంలో తెలంగాణ అధికారపక్షం ఎలాంటి మొహమాటానికి పోకుండా తాట తీస్తున్నా.. జానాసాబ్ మాత్రం ప్రపంచబ్యాంక్ నివేదికను తప్పు పడుతూ.. అధికారపక్ష స్వరాన్ని వినిపించటం చూసినప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రికి మించిన అదృష్టవంతులు మరొకరు లేరన్న భావన కలగటం ఖాయం. మరి.. మీరేమంటారు?