Begin typing your search above and press return to search.

పుండు మీద కారం చల్లేలా జానారెడ్డి మాటలు

By:  Tupaki Desk   |   29 Dec 2016 10:08 AM GMT
పుండు మీద కారం చల్లేలా జానారెడ్డి మాటలు
X
తెలంగాణ అధికారపక్ష నేతల మాటల ముందు.. తెలంగాణ విపక్ష నేతల మాటలు కాసింత చిన్నబోతాయనే చెప్పాలి. కొంతమంది నేతలు ఓకే అయినా.. జానారెడ్డి లాంటి వారి మాటలు ధీటుగా ఉండవు. అలాంటి జానారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎక్కడో టచ్ అయ్యేలా చేయటమే కాదు.. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగానికి గురయ్యేలా చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

యూపీఏ హయాంలో చేసిన భూసేకరణ చట్టంలో కొన్ని మార్పుల్ని చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఈ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో ముందున్నారు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం. రైతుల కోసం రైతుల ప్రయోజనాల కోసం తరచూ పోరాటాలు చేసే ఆయన.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను ఆయన తీవ్రంగా అడ్డుకోవటం.. ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

భూసేకరణ చట్టానికి మార్పులు చేయటాన్ని తీవ్రంగా ఆగ్రహిస్తూ.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నాలు చేయగా.. వాటిని అడ్డుకోవటానికి నిరసనగా ఆయన మౌనదీక్షను చేయటం తెలిసిందే. దీనికి మద్దతు తెలుపుతూ.. కాంగ్రెస్ నేతలు కోదండరాం వద్దకు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతజానారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు కోదండరాం చేస్తున్న దీక్షాస్థలికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జానారెడ్డి భావోద్వేగంతో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా.. అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రజల ఆకాంక్ష మేరకు కృషి చేశామని.. సొంత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా ఇలాంటి అణిచివేత ఘటనలు చోటు చేసుకోవటం దురదృష్టకరంగా అభివర్ణించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరాంకు ఇలాంటి దుస్థితి వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని... కోదండరాంకే ఇలాంటి పరిస్థితి వస్తే.. సామాన్య ప్రజల సంగతేమిటి? అన్న ఆలోచనే ఆందోళనకు గురి చేస్తుందని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో అటు రాష్ట్రాన్ని.. ఇటు కేంద్రాన్ని వణికించిన కోదండరాం లాంటి ఉద్యమనేత.. తాను నిరసన తెలిపేందుకు సైతం అనుమతి లేని పరిస్థితికి వెళ్లటాన్ని ఊహించలేరు కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/