Begin typing your search above and press return to search.

ఉత్తమా? జానారెడ్డా? ఎవరిది పై‘చేయి’?

By:  Tupaki Desk   |   3 July 2017 10:30 AM GMT
ఉత్తమా? జానారెడ్డా? ఎవరిది పై‘చేయి’?
X
తెలంగాణలో ఈసారి గతం కంటే ఎన్నోకొన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకుంటామని గట్టి ఆశలతో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వర్గపోరు మొదలైపోయింది. ముఖ్యంగా పీసీసీ పీఠం కోసం ఇప్పుడు పోరు మొదలైంది. రాష్ర్టం ఏర్పడిన తరువాత పీసీసీ పీఠం ఇస్తామన్నా భయపడి దూరందూరం పారిపోయినవారంతా ఇప్పుడు అదే పీఠంపై కన్నేశారు. అదేసమయంలో ఎవరూ ముందుకురాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీసీసీ పీఠంపై కూర్చుని అలాగే కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తొలి దశలో ఇది ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించినా ఇప్పుడు మాత్రం ఎలాగైనా పీఠం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

కుర్చీని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఉత్తమ్ ట్రయ్ చేస్తుంటే... ఆయన్ను ఎలాగైనా దించేయాలని జానా ప్రయత్నిస్తున్నారట. ఆయన ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తన మనోగతాన్ని వెల్లడించినట్టు కాంగ్రెస్ కోడి కూస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు కూడా లేనందున, పార్టీ నాయకత్వ స్థానంలో ఉంటేనే అనంతరం కాలం కలిసొస్తే ముఖ్యమైన పదవి అందే చాన్సుంటుందని జానా స్కెచ్ గీసినట్లు చెబుతున్నారు.

అయితే.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా జానాకు దీటుగా పై ఎత్తులు వేస్తున్నట్టు చెబుతున్నారు. తన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లేలా ఆయనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర నేతల తెర వెనక పోరు రాష్ట్ర కాంగ్రెస్‌ ను ఎటు నడిపిస్తుందో అని నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడిప్పుడే టీఆరెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ కు కొంతలో కొంత బెటర్మెంటు వస్తున్న సమయంలో ఇలా కుర్చీల కోసం ఇప్పటినుంచే కొట్లాడుకుంటే దెబ్బయిపోవడం ఖాయమంటున్నారు వారు.

సీఎల్పీ నేతగా కంటే పీసీసీ సారథిగా ఉంటేనే పార్టీపై పట్టు చిక్కుతుందన్నది జానా అభిమతంగా తెలుస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ పెద్దలతో ఆయన ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారని తెలిసింది. మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతతో కలిసి ఇప్పటికే అహ్మద్‌ పటేల్ - గులాంనబీ ఆజాద్ - దిగ్విజయ్‌ సింగ్‌ తదితరులతో జానా సమావేశమైనట్టు సమాచారం. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కూడా జానా కలిశారని అంటున్నారు. మరోవైపు జానా వ్యూహాలను పసిగట్టిన ఉత్తమ్ - ప్రతి వ్యూహాల్లో తలమునకలుగా ఉన్నారట. ఢిల్లీలో ప్రభావం చూపగలిగే ముఖ్య నేతలతో ఉత్తమ్‌ వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారని.. తన వ్యతిరేకులతోనూ మంచిగా ఉంటున్నారని టాక్. ఈ నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/