Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు జానా వార్నింగ్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   17 March 2016 5:03 AM GMT
కేసీఆర్ కు జానా వార్నింగ్ ఇచ్చారా?
X
తెలంగాణ అధికారపక్షాన్ని ఈ మధ్య కాలంలో మరే నేత విమర్శించని ఘాటుగా విమర్శించటమే కాదు.. అధికారం అన్నది శాశ్వతం కాదన్న విషయాన్ని స్పష్టం చేసి.. భవిష్యత్ దర్శనం చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డికే దక్కుతుంది. తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓ రేంజ్ లో ఏసుకోవటమే కాదు.. కేసీఆర్ తరచూ వాడే మాటల్ని ప్రస్తావిస్తూ.. అందుకు చరిత్రను ఉదాహరణగా చూపిస్తూ చేసిన విమర్శలు ఆసక్తికరంగానే కాదు.. ఆలోచించేలా ఉండటం గమనార్హం.

కొందరు టీఆర్ ఎస్ నేతలు.. మంత్రులు రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు తప్పించి మరో పార్టీకి స్థానం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం.. ప్రతిపక్షం రెండూ ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు జానా వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంకో పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని అధికారంలోకి వచ్చారా? అంటూ సూటిగా ప్రశ్నించిన జానా.. రాజకీయాల్లో కాలం పాత్రను సమయోచితంగా ప్రస్తావించారు.

‘‘ఏ పార్టీ రాష్ట్రంలో ఉండొద్దు. ఓట్లు అడగటానికి వీల్లేదు అనటం ప్రజాస్వామ్య పద్ధతా? నియంతృత్వ పోకడలకు నిదర్శనం కాదా? అయినా.. సంయమనం పాటిస్తున్నాం. సర్ది చెప్పుకుంటున్నాం. పక్క అసెంబ్లీ (ఏపీ) చూసి.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని నా పార్టీ.. నేను చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాం. అధికారం ఎప్పుడూ ఒకరి దగ్గరే శాశ్వతంగా ఉండదు’’ అంటూ జానా చెప్పుకొచ్చారు.

తమిళనాడులో జయలలిత ఒక్కరే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో ఆమెను అసెంబ్లీ నుంచి గెంటేశారని.. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి అప్రతిహతంగా సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఒకప్పుడు లోక్ సభలో బీజేపీకి రెండు సీట్లు ఉండేవి. ఇప్పుడు బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అది గుర్తుంచుకోవాలి. కేసీఆర్ చెప్పిన ఆత్మగౌరవ నినాదం అందరకి వర్తిస్తుంది. ఆ విషయాన్ని గుర్తించిపాలన సాగించాలి’’ అంటూ హుందాగా చెప్పిన జానారెడ్డి మాటల్లో వార్నింగ్ ఎంత తీవ్రంగా.. స్పష్టంగా ఉందో గమనించారా?